బెంగళూరు: బెంగళూరులో ఉదయం పూట వాకింగ్ చేస్తున్న 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఒక పెంపుడు కుక్క అతి కిరాతకంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆమె తల, మెడ, ముఖం, చేతులు మరియు కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు ఏకంగా 50 కుట్లు పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అందరినీ వణికిస్తోంది.
ఘటన వివరాలు: బెంగళూరు హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్లోని టీచర్స్ కాలనీలో అమరేష్ రెడ్డి అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన తన ఇంట్లో ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఆయన ఇంటి పక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాలిని దూబే (31) నివసిస్తున్నారు.
జనవరి 26న ఉదయం 6:53 గంటల ప్రాంతంలో షాలిని తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్నారు. అప్పుడు ఇంటి బయట ఉన్న అమరేష్ రెడ్డి కుక్క ఒక్కసారిగా ఆమెపైకి దూకింది. భయంతో ఆమె పరుగులు తీయగా, ఆ కుక్క వెంటాడి మరీ ఆమెను కింద పడేసి కొరికింది. ఆమె కేకలు విన్న కుక్క యజమాని మరియు ఇతరులు బయటకు వచ్చి కుక్కను బెల్టులు, బ్యాట్లతో కొట్టారు. ఆ సమయంలో కుక్క ఆమెను వదిలేసి తన యజమానిపై కూడా దాడి చేసి, అతడి ముఖం, తల కొరికి ఈడ్చుకెళ్లింది.
చివరికి స్థానికులంతా కలిసి ఆ కుక్క బారి నుండి వారిద్దరినీ రక్షించారు. తీవ్రంగా గాయపడిన షాలినిని ఆసుపత్రికి తరలించగా, ఆమెకు 50 కుట్లు వేశారు. దీనిపై షాలిని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కుక్క యజమానిపై కేసు నమోదైంది.
