మూర్ఖుడైన విజయ్ చేతిలో తమిళ ప్రజలు మోసపోబోతున్నారు.. మాజీ జస్టిస్ మార్కండేయ కట్జూ ఘాటు విమర్శలు

చెన్నై: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు టీవీకే (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, “మెదడులో ఏమీ లేని విజయ్ అనే ముర్ఖుడైన సినీ నటుడి చేతిలో తమిళ ప్రజలు త్వరలోనే మోసపోబోతున్నారు” అంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ వద్ద లేదు. దీంతో ఆయన ఇతర పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ (5), సీపీఎం (2), సీపీఐ (2) కలిపి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీనితో విజయ్ బలం 116కు చేరింది (విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక సీటు తగ్గింది). మెజారిటీకి ఇంకా ఒక ఎమ్మెల్యే మద్దతు అవసరమవుతోంది.

సందిగ్ధంలో విజయ్
విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) అధ్యక్షుడు తొల్ తిరుమావళవన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతుపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక లేఖ అందలేదు. ఈ కారణంగా విజయ్ నిన్న మూడోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ, రాజ్‌భవన్ నుండి ఇంకా అధికారిక ఆహ్వానం అందలేదు.

విజయ్‌పై విమర్శలు
ఈ పరిస్థితుల్లో మార్కండేయ కట్జూ, విజయ్ ముఖ్యమంత్రి కావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో.. “తమిళనాడులోని భారీ సామాజిక-ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియని, మెదడులో ఏమీ లేని సినీ నటుడు, కేవలం మాటలతో ప్రజలను రెచ్చగొట్టే విజయ్ తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తమిళులు త్వరలోనే ఈ ముర్ఖుడి చేతిలో మోసపోతారు. హరి ఓం” అని పోస్ట్ చేశారు.

వివాదం
కట్జూ వ్యాఖ్యలు టీవీకే కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. ఆ తర్వాత ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. రాజకీయ నాయకులను విమర్శిస్తూ కట్జూ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు నేరుగా విజయ్‌ను ‘ముర్ఖుడు’ అని విమర్శించడం చర్చనీయాంశమైంది.

ఎవరీ మార్కండేయ కట్జూ?
ఈయన 1991లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో అదే కోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2004 నవంబర్‌లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2005లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2006లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో పదవీ విరమణ చేశారు. 2011 నుండి 2014 వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ రీయూనిఫికేషన్ అసోసియేషన్’ (IRA) అనే సంస్థను స్థాపించి.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను మళ్ళీ భారత్‌లో విలీనం చేసి ఒక లౌకిక దేశంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.


Posted

in

by

Tags: