విశాఖపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ప్రియురాలిని, మరో స్నేహితుడితో కలిసి దారుణంగా హత్య చేసి శవాన్ని చెరువులో పడేసిన షాకింగ్ ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది.
పార్వతీపురం మన్యం జిల్లా తుమరాడ గ్రామంలోని ఓ చెరువులో జూన్ 9వ తేదీన 34 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ఘోర హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
సచివాలయం వాలంటీర్‌గా ఉన్నప్పుడే పరిచయం:
పోలీసుల ప్రాథమిక విచారణలో హత్యకు గురైన మహిళ పాలకొండ మండలం, పర్నా సీతంపేట ప్రాంతానికి చెందిన ఉషారాణి (34)గా గుర్తింపు లభించింది. ఈమె గత ప్రభుత్వంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న సమయంలో, ఆమెతో పాటు పనిచేసే భువనేశ్వర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తీవ్రంగా ప్రేమించుకోవడమే కాకుండా, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడే భువనేశ్వర్ అసలు రంగు బయటపడింది.
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది!
భువనేశ్వర్‌కు అప్పటికే అదే ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్న కృపారాణి అనే వివాహితతో అక్రమ సంబంధం ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని ఉషారాణి నిరంతరం ఒత్తిడి చేస్తుండటంతో.. ఆమెను వదిలించుకుని కృపారాణితో కలిసి జీవించాలని భువనేశ్వర్ ప్లాన్ చేశాడు. ఉషారాణి బ్రతికుంటే తాము కలిసి ఉండలేమని భావించిన భువనేశ్వర్.. తన ప్రియురాలు కృపారాణి, స్నేహితుడు తేజేశ్వరరావులతో కలిసి ఆమెను హతమార్చడానికి ఒక భయంకరమైన స్కెచ్ వేశాడు.
కారులోనే గొంతు నులిమి హత్య:
పథకం ప్రకారం.. జూన్ 6వ తేదీన ఉషారాణిని కారులో ఎక్కించుకున్న ఈ ముగ్గురు, ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. ఆమె స్పృహ తప్పిపోగానే కారులోనే గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. అనంతరం మొదట శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస సమీపంలోని ఒక చెరువులో మృతదేహాన్ని పడేశారు. అయితే అక్కడ నీరు తక్కువగా ఉండటంతో శవం పైకి కనిపించింది.
దాంతో భయపడిపోయిన నిందితులు.. శవాన్ని మళ్లీ కారులోకి ఎక్కించుకుని పార్వతీపురం మన్యం జిల్లా తుమరాడ గ్రామంలోని మరో చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఈసారి శవం పైకి తేలకుండా ఉండేందుకు మృతదేహానికి భారీ బండరాళ్లను కట్టి నీటిలోకి విసిరేసి అక్కడి నుండి పరారయ్యారు. జూన్ 9న మృతదేహం నీటిపై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేవలం కొద్ది గంటల్లోనే నిందితులు భువనేశ్వర్, కృపారాణి, తేజేశ్వరరావులను అరెస్ట్ చేశారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు.

Leave a Reply