మెంతి, నేరేడు, దాల్చినచెక్క మధుమేహాన్ని నయం చేస్తాయా? 8 అపోహలు – నిజాలు!

భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం అనేది కేవలం ఒక పదార్థంతో తగ్గిపోయేది కాదు, ఇది క్రమబద్ధమైన జీవనశైలి మార్పులతో నిర్వహించాల్సిన సమస్య.

అపోహ 1: చక్కెర ఎక్కువగా తింటే నేరుగా మధుమేహం వస్తుంది.

నిజం: కేవలం చక్కెర మాత్రమే కారణం కాదు. ప్రాసెస్ చేసిన ఆహారం, అనారోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల బరువు (ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు) పెరుగుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

అపోహ 2: పండ్లలో చక్కెర ఉంటుంది కాబట్టి వాటిని అస్సలు తినకూడదు.

నిజం: పండ్లలో సహజమైన ఫ్రక్టోజ్ ఉన్నప్పటికీ, వాటిలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పండ్ల రసాల కంటే పండును నేరుగా తినడం మేలు. మితంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.

అపోహ 3: చక్కెర కంటే బెల్లం, తేనె చాలా మంచివి.

నిజం: బెల్లం, తేనె, పంచదార.. ఈ మూడూ కార్బోహైడ్రేట్లే. బెల్లంలో ఖనిజాలు ఉన్నప్పటికీ, ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వీటిని కూడా పరిమితంగానే వాడాలి.

అపోహ 4: అన్నం పూర్తిగా మానేయాలి.

నిజం: అన్నం పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. అయితే అన్నంతో పాటు రోటీ వంటి ఇతర కార్బోహైడ్రేట్లు కలపకూడదు. అన్నంతో పాటు తగినంత ప్రోటీన్ (పప్పు, పెరుగు) మరియు పీచు పదార్థం (కూరగాయలు) ఉండేలా చూసుకోవాలి. ఇది ‘గ్లైసెమిక్ లోడ్’ను తగ్గిస్తుంది.

అపోహ 5: షుగర్-ఫ్రీ స్వీట్లు ఎంతైనా తినవచ్చు.

నిజం: ‘షుగర్-ఫ్రీ’ అని లేబుల్ ఉన్నంత మాత్రాన అవి ఆరోగ్యకరం అని అర్థం కాదు. వాటిలో కొవ్వులు, క్యాలరీలు ఎక్కువగా ఉండవచ్చు. వీటిని ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

అపోహ 6: మెంతి, నేరేడు పండు లేదా దాల్చినచెక్క మధుమేహాన్ని నయం చేస్తాయి.

నిజం: ఏ ఒక్క ఆహార పదార్థం కూడా మధుమేహాన్ని శాశ్వతంగా నయం చేయదు. ఇవి ఆహారానికి అదనపు పోషక విలువలను ఇస్తాయి తప్ప, మందులకు ప్రత్యామ్నాయం కావు.

అపోహ 7: కేవలం ఊబకాయం ఉన్నవారికి మాత్రమే డయాబెటిస్ వస్తుంది.

నిజం: సన్నగా ఉన్నవారికి కూడా టైప్-2 డయాబెటిస్ రావచ్చు. అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వు (Visceral Fat) వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. దీనిని ‘లీన్ డయాబెటిస్’ అంటారు.

అపోహ 8: మూలికలు లేదా ప్రత్యేక డైట్లతో డయాబెటిస్‌ను నయం చేయవచ్చు.

నిజం: ప్రస్తుతానికి మధుమేహానికి శాశ్వత నివారణ (Cure) లేదు. కొన్ని సందర్భాల్లో బరువు తగ్గి, జీవనశైలి మార్చుకోవడం ద్వారా ‘రెమిషన్’ (Remission) సాధించవచ్చు, అంటే మందులు లేకుండా చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. కానీ ఇది డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి.


Posted

in

by

Tags: