తెలంగాణ: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో, భర్త శరీరంలోకి టాయిలెట్ క్లీనర్ (యాసిడ్) ఎక్కించి అత్యంత క్రూరంగా హత్య చేసిన భార్య ఉదంతం తెలంగాణలో వెలుగుచూసింది.
గల్ఫ్ దేశంలో పనిచేస్తున్న ప్రశాంత్ (35) అనే వ్యక్తి జూన్ 30న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తన కుమారుడి మరణంపై అనుమానం ఉందని ప్రశాంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాల ద్వారా ప్రశాంత్ భార్య సంధ్య (32)కు, అనిల్ (35) అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు బయటపడింది.
తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రశాంత్‌ను అడ్డుతొలగించుకోవాలని సంధ్య, తన ప్రియుడు అనిల్ కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నారు. ఇందుకోసం వెంకట సాయి అనే వ్యక్తి సహాయం తీసుకున్నారు. పథకం ప్రకారం, జూన్ 29న ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి, మేడ పైకి తీసుకెళ్లి, సంధ్య ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు కిందకు తోసేశారు. అయితే, ఆ ప్రయత్నంలో ప్రశాంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇప్పించిన సంధ్య మరియు సాయి, ఆ తర్వాత అతడిని ఇంటికే తీసుకొచ్చారు.
అయినప్పటికీ, ప్రశాంత్‌ను చంపాలనే కసితో ఉన్న సంధ్య, ప్రియుడు అనిల్ ప్రోద్బలంతో మరో ప్లాన్ వేసింది. చికిత్స పొందుతూ మంచానికే పరిమితమైన భర్త శరీరంలోకి, ట్యూబ్ ద్వారా టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ మరియు మత్తు మందును ఎక్కించి అత్యంత పాశవికంగా హత్య చేసింది. అనంతరం అతడిని మంచం పైనుంచి కూడా కిందకు తోసి చంపేసింది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో, సంధ్య, ఆమె ప్రియుడు అనిల్ మరియు వారి సహచరుడు వెంకట సాయిలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
