అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ రాజకీయాన్ని అనుసరించగలరా?: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పోరాటం, ప్రజా ఉద్యమాలు, రాజకీయ దాడులను ప్రజా సానుభూతిగా మార్చుకునే కళలో మమతా బెనర్జీకి ఎవరూ సాటిరారు. 1990లో కోల్‌కతాలోని హజ్రా మోడ్ వద్ద ఆమెపై జరిగిన దాడి కేవలం ఒక రాజకీయ ఘటన మాత్రమే కాదు, అది మమతా బెనర్జీని రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ప్రజా నాయకురాలిగా నిలబెట్టిన కీలక మలుపు. ఆ సంఘటన తర్వాత, ఆమె అధికారంతో పోరాడే ధైర్యం ఉన్న నాయకురాలిగా, ప్రజల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడే యోధురాలిగా గుర్తింపు పొందారు.
దాదాపు 36 ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మళ్ళీ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఈసారి కేంద్ర బిందువు తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఇటీవల ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, గుడ్లు విసిరారు. ఘటన తర్వాత ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి వెళ్లారు. దీన్ని తృణమూల్ కాంగ్రెస్ ఒక తీవ్రమైన రాజకీయ దాడిగా పేర్కొంది. మరి అభిషేక్ బెనర్జీ కూడా మమతా బెనర్జీలాగే ఈ ఘటనను తన రాజకీయ బలంగా మార్చుకోవాలనుకుంటున్నారా? అంతకంటే ముఖ్యమైన ప్రశ్న.. 2026 నాటి బెంగాల్, 1990 నాటి బెంగాల్‌తో పోల్చదగినదా?
మారిన బెంగాల్ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. 1990వ దశకంలోని బెంగాల్ పూర్తిగా వేరు. అప్పట్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్యే పోటీ ఉండేది. వామపక్షాలు సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంతో, ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. బీజేపీకి అప్పట్లో రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. అటువంటి రాజకీయ శూన్యతను మమతా బెనర్జీ భర్తీ చేశారు. హజ్రా మోడ్ ఘటన ఆమెకు ఒక పోరాట యోధురాలి ఇమేజ్‌ను ఇచ్చింది. 2011లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు ఆమె తెరదించారు. మమతా బెనర్జీ విజయం వెనుక ఏళ్ల తరబడి సాగిన ప్రజా పోరాటాలు, సంస్థాగత నిర్మాణం ఉన్నాయి. కానీ అభిషేక్ బెనర్జీ పరిస్థితి భిన్నంగా ఉంది.
నేటి పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. గత దశాబ్ద కాలంగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీపై సానుభూతిని సృష్టించడం అంత సులభం కాదు. అంతేకాకుండా, అభిషేక్ బెనర్జీపై ప్రతిపక్షాలు ‘వారసత్వ రాజకీయాల’ (Family Politics) ముద్ర వేశాయి. అవినీతి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఇవి ఆయన ప్రజాదరణను కొంత మేరకు ప్రభావితం చేశాయి. మమతా బెనర్జీకి 1990లో వచ్చినంత విశాలమైన సానుభూతి అభిషేక్‌కు సహజంగా రావడం లేదు.
ప్రతిపక్షం కూడా మారిపోయింది 1990లలో వామపక్షాలు బలంగా ఉన్నా, జాతీయ స్థాయిలో వారి ప్రభావం పరిమితం. కానీ ఇప్పుడు బీజేపీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది. పశ్చిమ బెంగాల్‌లో కూడా గత పదేళ్లలో బీజేపీ తన ఉనికిని చాటుకుంది. 2021 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తృణమూల్ కాంగ్రెస్ ముందు ఇప్పుడు బీజేపీ రూపంలో అతిపెద్ద సవాలు ఉంది.
మమతా బెనర్జీ తన రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవాలని, అభిషేక్‌ను పార్టీలోనూ, ప్రజల్లోనూ బలమైన నాయకుడిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న ఆక్రమక వైఖరి, ఇండియా కూటమి మద్దతు అన్నీ ఒక వ్యూహాత్మక ప్రణాళికలో భాగమే. అయితే, రాజకీయాలు కేవలం వ్యూహాలతోనే నడవవు. ప్రజల నిర్ణయం తుది తీర్పునిస్తుంది.
మమతా బెనర్జీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కష్టపడి సంపాదించుకున్నారు. అభిషేక్ బెనర్జీ కూడా అదే స్థాయి ఆమోదాన్ని పొందాలంటే, ఆయన తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్రను వేసుకోవాలి. చివరగా ఒక్క మాట.. అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ కాదు, 2026 నాటి బెంగాల్ 1990 నాటి బెంగాల్ కాదు. ఈ ఘటన అభిషేక్ రాజకీయాలకు కొత్త ఊపునిస్తుందో, లేక కేవలం మరొక వివాదంగా మిగిలిపోతుందో వేచి చూడాలి.
