తెలంగాణ రాష్ట్రం నల్గొండ సమీపంలో అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే కారణంతో భర్తను, ప్రియుడితో కలిసి తలపై బండరాయితో కొట్టి చంపిన భార్య పోలీసులకు లొంగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. రామావత్ రవి (34) అనే వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసేవాడు. ఇతనికి లక్ష్మి అనే మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే లక్ష్మికి తన భర్త అక్క కొడుకైన (మేనల్లుడు) గణేష్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది.
దీనిని గమనించిన రవి మరియు కుటుంబ సభ్యులు లక్ష్మిని పలుమార్లు మందలించారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తన మార్చుకోకుండా గణేష్‌తో సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయమై గత నెల 26న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ గొడవ తర్వాత పుట్టింటికి వెళ్లిన లక్ష్మి, మొన్న రాత్రి తిరిగి భర్త ఇంటికి వచ్చింది. ఆ రాత్రి కూడా మళ్ళీ గొడవ జరిగింది.
అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో లక్ష్మి తన ప్రియుడు గణేష్‌ను ఇంటికి రప్పించింది. గాఢనిద్రలో ఉన్న రవి తలపై బండరాయితో కొట్టి అత్యంత క్రూరంగా హత్య చేశారు. అనంతరం ఇద్దరూ అక్కడి నుండి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం రవి తండ్రి లక్ష్మణ్ నాయక్ లేచి చూసేసరికి కుమారుడు రక్తపు మడుగులో శవమై కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసుల విచారణ కొనసాగుతుండగానే, నిందితులు లక్ష్మి మరియు గణేష్ పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
