ఒడిశా రాష్ట్రం కెందుఝర్ (కియోంఝర్) జిల్లాలోని గుంజి గ్రామానికి చెందిన నటబర జువాంగ్, ఆయన భార్య కుంత్ జువాంగ్ దంపతులు తమ ముగ్గురు దివ్యాంగ కుమార్తెలతో అత్యంత పేదరికంలో జీవనం సాగిస్తున్నారు.
కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నప్పటికీ, వీరికి సొంతంగా వ్యవసాయ భూమి లేదు. ఎలాంటి శాశ్వత ఆదాయ వనరులు లేకపోవడంతో నిత్య జీవితాన్ని నెట్టుకురావడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వయసు మీదపడటంతో, మునుపటిలా కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించడం కూడా ఆ వృద్ధ తల్లిదండ్రులకు భారంగా మారింది.
నటబర-కుంత్ దంపతులకు మొత్తం ఐదుగురు కుమార్తెలు. వారిలో ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా, మిగిలిన ముగ్గురు ఆడబిడ్డలు పుట్టుకతోనే దివ్యాంగులుగా ఉన్నారు. వారు స్వతహాగా నడవలేకపోవడంతో రోజంతా ఇంటికే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది. బయటకు వెళ్లాల్సి వస్తే నేలపై పాకుతూ వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలోని గుంతల రోడ్లు, వర్షాకాలంలో బురద వారి కష్టాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఆసుపత్రులకు లేదా బడికి వెళ్లడం వంటి కనీస అవసరాలకు కూడా ఇతరుల సహాయంపైనే ఆధారపడాల్సి వస్తోంది.
గిరిజన తెగకు చెందిన ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తరఫున నెలకు 35 కిలోల బియ్యం ఉచితంగా అందుతున్నాయి. ప్రధానంగా దానిపైనే ఆధారపడి వారి ఆకలి తీర్చుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ప్రభుత్వం నుంచి కేవలం రెండు వీల్చైర్లు మాత్రమే అందాయని వారు తెలిపారు. అలాగే చికిత్స కోసం సుమారు రూ.20 వేల ఆర్థిక సాయం అందింది. అయితే ఆ ముగ్గురు పిల్లల నిరంతర వైద్యం, మందులు, రోజువారీ అవసరాలకు ఈ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఈ కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై సమాచారం వెలుగులోకి రావడంతో, కెందుఝర్ జిల్లా యంత్రాంగం ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ కుటుంబానికి పెంచిన పింఛను, అదనపు బియ్యం సహా అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పరిపాలనాధికారి కుమార్ నాగభూషణ్ తెలిపారు. అయితే నటబర, కుంత్ దంపతులను తీవ్రంగా వేధిస్తున్నది మాత్రం తమ కుమార్తెల భవిష్యత్తే. “మాకు వయసైపోయింది. రేపు మాకేదైనా జరిగితే, ఈ ముగ్గురు ఆడపిల్లలను ఎవరు కనిపెట్టుకుని చూస్తారు?” అనే ప్రశ్నే వారి గుండెలను పిండేస్తోంది. ఒక పక్కా ఇల్లు, సరైన వైద్య సదుపాయాలు, నిరంతర ప్రభుత్వ ఆసరా దక్కితేనే తమ బిడ్డల జీవితాలకు ఓ భరోసా దక్కుతుందని ఆ నిస్సహాయ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Leave a Reply