ఐక్యరాజ్యసమితికి చెందిన జాతి వివక్ష నిర్మూలన కమిటీ (UN CERD), భారతదేశంలోని గిరిజనులు (ఆదివాసీలు), దళితులు మరియు ఇతర బలహీన వర్గాలపై జరుగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
దాదాపు రెండు దశాబ్దాల (20 ఏళ్ల) తర్వాత భారత్ ఈ సమీక్షను ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది.
CERD విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని శాంతిభద్రతల రక్షణ విభాగాలు (పోలీస్, దర్యాప్తు సంస్థలు) గిరిజనులు, షెడ్యూల్డ్ కులాలు (ముఖ్యంగా దళితులు), బెంగాలీ మాట్లాడే ముస్లింలు వంటి అణగారిన వర్గాల ప్రజలపై భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. చట్టవిరుద్ధ హత్యలు (ఎన్కౌంటర్లు), తీవ్ర చిత్రహింసలు, సరైన పత్రాలు లేకుండా దీర్ఘకాలిక నిర్బంధాలు, లైంగిక దాడులు వంటి తీవ్ర ఆరోపణలపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
రోహింగ్యాలు, బెంగాలీ మాట్లాడే ముస్లింలు మరియు శరణార్థులపై పోలీసుల కఠిన చర్యలు, జాతి ప్రాతిపదికన ప్రొఫైలింగ్ (Racial profiling), కారణం లేని అరెస్టులను కమిటీ ఎత్తిచూపింది. అంతేకాకుండా, అంతర్జాతీయ రక్షణ అవసరమైన వారిని బలవంతంగా దేశం నుంచి బహిష్కరించడం (డిపోర్టేషన్) మానుకోవాలని సూచించింది.
భారతదేశంలో కుల వ్యవస్థ అనేది నేటికీ సామాజిక హోదా, విద్య, అవకాశాల లభ్యతపై బలమైన ప్రభావాన్ని చూపుతోందని ఐక్యరాజ్యసమితి కమిటీ పేర్కొంది. చారిత్రక సామాజిక ఆచారాలతో ముడిపడివున్న ఈ కుల వ్యవస్థపై నివేదికలో ప్రస్తావించింది. 182 సభ్య దేశాలు ఉన్న ఈ అంతర్జాతీయ ఒప్పందం కింద.. జాతి వివక్షను రూపుమాపి, చట్టం ముందు అందరూ సమానులే అనే నిబంధనకు భారత్తో సహా సభ్య దేశాలన్నీ కట్టుబడి ఉండాలి.
ఈ సమీక్షలో భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ సందర్భంగా భారతదేశంలోని వైవిధ్యం, విస్తీర్ణం మరియు సంక్లిష్ట పరిస్థితులను భారత బృందం ప్రస్తావించింది. భారత రాజ్యాంగం మరియు చట్టపరమైన రక్షణల ద్వారా పౌరులందరికీ సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించింది. ఐరాస కమిటీ ఇచ్చే సిఫార్సులు చట్టబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత లేనప్పటికీ, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మరియు మానవ హక్కుల రికార్డులపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply