మైసూర్ సిల్క్ క్రేజ్ అంటే ఇదే: చీర కోసం వేకువజామున 4 గంటలకే క్యూ.. బెంగళూరు అమ్మాయి వైరల్ వీడియో!

బెంగళూరు: ఆడవారి అందానికి నిండుదనాన్ని ఇచ్చేది చీరకట్టు. ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా, మరెన్ని వెస్ట్రన్ డ్రెస్సులు అందుబాటులోకి ఉన్నా చీరలకు ఉండే క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. అందులోనూ ‘మైసూర్ సిల్క్’ చీరలంటే మహిళలకు ప్రాణం. ఆ చీరల మీద ఉన్న మక్కువతో, ఎంత ధరైనా వెచ్చించి వాటిని సొంతం చేసుకునేందుకు వెనకాడరు. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక యువతి మైసూర్ సిల్క్ చీర కోసం చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

6 గంటల నిరీక్షణ.. టోకెన్ కోసం పోటీ!
బెంగళూరులోని జయనగర్లో ఉన్న కేఎస్ఐసీ (KSIC) మైసూర్ సిల్క్ షోరూమ్ ముందు ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సోనా సెబిన్ అనే యువతి తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రకారం.. మైసూర్ సిల్క్ చీర కొనడానికి ఆమె వేకువజామున 4 గంటలకే షోరూమ్ వద్దకు చేరుకుంది.

వేకువజామునే క్యూ: ఆమె వెళ్లేసరికి అప్పటికే చాలా మంది మహిళలు లైన్లో ఉన్నారు. ఒక మహిళ తానేమో తెల్లవారుజామున 3 గంటలకే వచ్చానని చెబితే, మరో వ్యక్తి ఏకంగా ముందు రోజు రాత్రి 9 గంటల నుంచే క్యూలో నిలబడినట్లు చెప్పడం విశేషం.

కఠిన నిబంధనలు: ఈ షోరూమ్ ఉదయం 10:30 గంటలకు మాత్రమే తెరుస్తారు. లోపలికి ఒకేసారి కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తారు. అంతేకాదు, ఒక్కో కస్టమర్ కేవలం 10 నిమిషాల్లోనే చీరను ఎంపిక చేసుకోవాలి. ఒక టోకెన్ మీద ఒకే చీర ఇస్తారట.

ధరలు లక్షల్లో ఉన్నా తగ్గని డిమాండ్
మైసూర్ సిల్క్ చీరల ధరలు ₹23,000 నుంచి ప్రారంభమై ₹2.5 లక్షల వరకు ఉంటాయి. ధర ఇంత ఎక్కువగా ఉన్నా, ఆ చీరల నాణ్యత మరియు వాటికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా మహిళలు గంటల తరబడి నిరీక్షించేందుకు సిద్ధపడుతున్నారు. కాఫీ తాగడానికి బయటకు వెళ్లి వచ్చేలోపు క్యూ లిస్టులో మరో 50 పేర్లు చేరడం చూసి ఆ యువతి ఆశ్చర్యపోయింది.


Posted

in

by

Tags: