రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక బీహారీ వధువు సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. డబ్బు కోసం ఒక యువకుడిని పెళ్లి చేసుకున్న ఆమె, తన అసలు స్వరూపం బయటపడటంతో భర్తను గదిలో బంధించి పారిపోవాలని ప్రయత్నించింది.
అసలేం జరిగింది? భారత్ అనే యువకుడికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదని, నందకిషోర్ సోనీ అనే వ్యక్తి పరిచయస్తుల ద్వారా బీహార్‌కు చెందిన సుమన్ (23) అనే యువతితో సంబంధం ఖరారు చేశాడు. ఈ పెళ్లి కోసం మధ్యవర్తులు భరత్ దగ్గర మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు. 1.70 లక్షల నగదు, 1.30 లక్షల ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకుని ఆర్యసమాజ్ మందిరంలో వివాహం జరిపించారు. అయితే, పెళ్లయిన రెండు రోజులకే ఆ వధువు ఒక ‘లూటేరీ దుల్హన్’ (దొంగ వధువు) అని భరత్‌కు తెలిసింది. దీనిపై వారిద్దరి మధ్య గొడవ జరగడంతో, సుమన్ భరత్‌ను గదిలో బంధించి, చీరలతో తాడు తయారు చేసి బాల్కనీ నుండి దూకడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి.
అసలు బండారం బయటపడింది: ఆమె పారిపోవడానికి వచ్చిన తోటి ముఠా సభ్యులు రవి, సందీప్ ఆమెను వదిలేసి పరారయ్యారు. కుటుంబ సభ్యులు సుమన్‌ను పట్టుకుని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో కూడా ఆమె తన తండ్రి పేరును మారుస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించింది. పోలీసులు విచారణ చేపట్టగా, ఆమె ఇప్పటికే వివాహిత అని, పెళ్లి కోసం నకిలీ పత్రాలు సృష్టించిందని తేలింది. సుమన్ బీహార్‌లోని ఔరంగాబాద్ వాసి అని, ఆమెతో పాటు ఉన్న ముఠా సభ్యులు వివిధ ప్రాంతాలకు చెందిన వారని, వారు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠా అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
