మొదట్లో బాగానే పరిగెత్తింది..! ఆ తర్వాత కంట్రోల్ తప్పింది.. ‘బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్’ అన్నట్లుగా మారిన పరిస్థితి.. మారథాన్‌లో పరిగెడుతూ అమాంతం ఢీకొన్న రోబో.. వీడియో వైరల్..!

మనుషుల తరహాలోనే రెండు కాళ్లతో పరిగెత్తే హ్యూమనాయిడ్ రోబోకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఓ రన్నింగ్ ట్రాక్‌పై రోబో అత్యంత వేగంగా పరిగెత్తడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ప్రారంభంలో చాలా వేగంగా, సమతుల్యతతో పరుగెత్తిన రోబో.. ఆ తర్వాత హఠాత్తుగా ట్రాక్ నుంచి పక్కకు వెళ్లిపోయింది. వేగాన్ని నియంత్రించుకోలేక సమీపంలో ఉన్న విద్యుత్ పరికరాల పెట్టెను బలంగా ఢీకొట్టింది.

రోబో వేగం క్రమంగా పెరుగుతూ వెళ్లడంతో, ట్రాక్ చివరకు చేరుకునే సమయానికి అది సరైన సమయంలో స్పీడ్ తగ్గించలేకపోయింది. అంతేకాకుండా, దిశను మార్చుకోవడంలోనూ ఇబ్బంది పడినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పక్కనే ఉన్న మెటల్ విద్యుత్ బాక్స్‌ను నేరుగా ఢీకొట్టింది. ఆ ధాటికి సమతుల్యత కోల్పోయి నేలపై కుప్పకూలింది.

ఈ వీడియో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. మనుషుల్లాగే వేగంగా పరిగెత్తే స్థాయికి రోబోటిక్స్ సాంకేతికత ఎదగడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నప్పటికీ.. అత్యధిక వేగంతో పరిగెత్తేటప్పుడు సరైన సమయంలో ఆగడం, క్షణాల్లో బ్యాలెన్స్ చేసుకోవడం, అడ్డంకులను గుర్తించి దారి మళ్లడం వంటి అంశాల్లో ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

త్వరలో హ్యూమనాయిడ్ రోబోల క్రీడా పోటీలు జరగనున్న తరుణంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజింగ్‌లో జరగనున్న రెండో ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోల క్రీడా పోటీల్లో 16 దేశాల నుంచి దాదాపు 2,000కు పైగా రోబోలు పాల్గొననున్నాయి. రన్నింగ్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్‌తో పాటు ఫ్యాక్టరీ పనులు, ఇంటి పనులు, అత్యవసర అగ్నిమాపక విధులకు సంబంధించిన విభాగాల్లోనూ ఈ పోటీలు జరగనున్నాయి.


Posted

in

by

Tags: