కర్ణాటక: యాదగిరి జిల్లాలో ఏదో ఘోరం జరుగుతోంది. తమ వద్ద నమోదైన (Registered) 3,000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు ఏమైందో తెలియక స్వయంగా ఆరోగ్య శాఖ అధికారులే దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
జిల్లాలో మొత్తం 30,000 మందికి పైగా గర్భిణీలు నమోదు కాగా, వారిలో పెద్ద సంఖ్యలో మహిళల ప్రసవ వివరాలు రికార్డుల్లో కనిపించడం లేదు. గడిచిన ఏడాది కాలంలో (2024-25) వెయ్యికి పైగా అక్రమ భ్రూణహత్యలు నిశ్శబ్దంగా జరిగి ఉండవచ్చనే భయాలు ఈ లెక్కలతో స్పష్టమవుతున్నాయి. ‘కన్నడ ప్రభ’ పత్రికలో మార్చి 18న ప్రచురితమైన ప్రత్యేక కథనంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
దీనిని తీవ్రంగా పరిగణించిన ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష గుప్తా తక్షణ విచారణకు ఆదేశించారు. ఐదుగురు వైద్య అధికారులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కేవలం యాదగిరిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని కోరారు.
నివ్వెరపరిచే గణాంకాలు: ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మార్చి 25న నిర్వహించిన సమీక్షా సమావేశంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్ నుండి నవంబర్ 2025 మధ్య కాలంలో జిల్లాలో 652 అబార్షన్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి.
3,127 కేసుల మిస్టరీ: 2024-25 కాలానికి సంబంధించిన డేటా మరింత ఆందోళనకరంగా ఉంది. మొత్తం 31,435 మంది గర్భిణీలు నమోదు కాగా.. వారిలో 26,584 మంది సజీవ శిశువులకు జన్మనిచ్చారు, 188 మంది శిశువులు మరణించారు. మరో 207 ప్రసవాలు జరగాల్సి ఉంది, 1,329 అబార్షన్లుగా నమోదయ్యాయి. అయితే వీటన్నింటినీ కలిపితే మొత్తం 28,308 మాత్రమే అవుతోంది. అంటే మిగిలిన 3,127 మంది మహిళల పరిస్థితి ఏంటనేది అటు అధికారులకు గానీ, ఇటు రికార్డులకు గానీ తెలియదు. వీరికి ప్రసవాలు జరిగాయా? శిశువులు సజీవంగా ఉన్నారా లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
నకిలీ ‘తాయి కార్డుల’ సృష్టి? ఆడ శిశువు అని తెలియగానే రహస్యంగా అబార్షన్లు చేయించుకోవడం వల్లే ఈ గణాంకాల్లో వ్యత్యాసం వచ్చి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 6 నుండి 10 వరకు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర స్థాయి కమిటీ అక్కడి పరిస్థితులు చూసి నివ్వెరపోయింది. కేవలం కాగితాలపై లక్ష్యాలను పూర్తి చేయడానికి నకిలీ ‘తాయి కార్డులు’ (ప్రసూతి కార్డులు) సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.
కలెక్టర్ ఆదేశాలు: యాదగిరి జిల్లా కలెక్టర్ హర్షల్ భోయర్ స్పందిస్తూ.. “రాష్ట్ర స్థాయి కమిటీ జిల్లాను సందర్శించి సమాచారాన్ని సేకరించింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. నేను ఇప్పటికే ఆరోగ్య అధికారులతో సమావేశమై నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, అబార్షన్లను అరికట్టాలని కఠిన ఆదేశాలు జారీ చేశాను” అని తెలిపారు.
