శివ్‌పురి: నేటి కాలంలో సోషల్ మీడియా అనేది కేవలం వినోద సాధనంగానే మిగిలిపోలేదు, అది ప్రజల వ్యక్తిగత జీవితాలను సమాజం ముందు ఉంచే ఒక అద్దంలా మారింది. అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ వ్లాగ్స్‌లో మీ సంతోషాలను, మీ ఇంట్లోని ప్రతి మూలను, మీ సంపదను ప్రదర్శించడం మిమ్మల్ని ఎంతటి పెద్ద ముప్పులోకి నెట్టేస్తుందో ఎప్పుడైనా ఊహించారా..?
మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఇది ‘డిజిటల్ ప్రైవసీ’ (Digital Privacy) మరియు సోషల్ మీడియాలో ‘షో-ఆఫ్’ (ఆర్భాటం) చేసే సంస్కృతిపై సరికొత్త చర్చకు దారితీసింది. ఇక్కడ ఒక ప్రముఖ గృహిణి, యూట్యూబర్ అయిన రచనా గుర్జర్‌కు సోషల్ మీడియాలో తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను, బంగారు, వెండి నగలను ప్రదర్శించడం భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. దొంగలు ఆమె చేసిన వీడియోలనే తమకు ‘గైడ్ మ్యాప్’గా మార్చుకుని, లక్షల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు.
అసలు ఏం జరిగిందంటే..? ఈ ఘటన మధ్యప్రదేశ్, శివ్‌పురి జిల్లా నరవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహానీ గ్రామంలో జరిగింది. ఇక్కడ నివసించే రచనా గుర్జర్ ఒక యూట్యూబర్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారూ 2:00 గంటల సమయంలో రచన మరియు ఆమె కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా, గుర్తుతెలియని ముసుగు దొంగలు వారి ఇంట్లోకి చొరబడ్డారు.
స్కెచ్ వేసి మరీ దోచేశారు: దొంగలు ఇంట్లోకి ప్రవేశించగానే ముందుగా చేసిన పని.. రచనా గుర్జర్ మరియు ఆమె కుటుంబ సభ్యులు పడుకున్న గదికి బయట నుండి గడియ పెట్టేశారు. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా ఇల్లంతా చాలా నిమ్మళంగా వెతికారు. ఇంట్లో ఉన్న భారీ బంగారు మరియు వెండి ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు, చివరికి ఎనర్జీ డ్రింక్స్ కార్టన్‌ను కూడా వదలకుండా సర్దుకుని అక్కడి నుండి రఫ్ఫూచక్కర్ అయ్యారు. దొంగతనం జరిగిన ఈ సొత్తు విలువ సుమారు 8 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తెల్లవారుజామున 4 గంటలకు వెలుగులోకి.. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో తెలిసింది. ఎవరో ఒకరు నిద్ర లేచి గది తలుపులు తెరవడానికి ప్రయత్నించగా, బయట నుండి లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. దాంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే తమ బంధువులకు ఫోన్ చేశారు. బంధువులు పరుగున వచ్చి బయట ఉన్న గడియ తీసి వారిని బయటకు తెచ్చారు. అనంతరం నరవార్ పోలీసులకు సమాచారం అందించారు.
దొంగల తెలివి – సీసీటీవీల యాంగిల్ మార్పు: పోలీసులు ఇంట్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక షాకింగ్ విషయం వెలుగుచూసింది. ముసుగు ధరించిన దొంగలు చేతిలో లాఠీలతో కనిపించారు. తమ ముఖాలు రికార్డ్ కాకుండా ఉండటం కోసం వారు చాలా తెలివిగా లాఠీ సహాయంతో సీసీటీవీ కెమెరాల యాంగిల్‌ను మరోవైపుకు తిప్పేశారు. దొంగలు బయటి వ్యక్తులు కాదని, అదే గ్రామానికి లేదా చుట్టుపక్కల ప్రాంతానికి చెందినవారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారికి ఆ కుటుంబం దినచర్య, పడుకునే సమయాలు మరియు ఇంటి నమూనాపై పూర్తి అవగాహన ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రచనా గుర్జర్ ఎవరు? రచనా గుర్జర్ మధ్యప్రదేశ్ శివ్‌పురి జిల్లాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, గృహిణి మరియు యూట్యూబర్. యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమెకు 1 లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచుగా తన లైఫ్‌స్టైల్, ఇల్లు మరియు రోజువారీ జీవితానికి సంబంధించిన వ్లాగ్స్‌ను వీడియోల రూపంలో షేర్ చేస్తూ ఉంటారు.
దొంగలకు ‘ఇన్ఫార్మర్’గా మారిన సోషల్ మీడియా: ఈ మొత్తం దోపిడీలో సోషల్ మీడియా పాత్రే అత్యంత కీలకమైనదిగా మారింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. రచన ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు దొంగలకు ‘ఇన్విటేషన్ కార్డ్’లా ఉపయోగపడ్డాయి. ఒక వీడియోలో రచన తన ఇంటి మెయిన్ గేట్ నుండి లోపలి గదులు, లాబీ మరియు సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ అమర్చారో కూడా స్పష్టంగా చూపించారు. మరొక వీడియోలో ఆమె తన బంగారు, వెండి నగలను, నగదును బల్లపై సర్ది మరీ ప్రత్యేకంగా చిత్రీకరించారు.
దొంగలు ఈ వీడియోలను పదే పదే చూసి మూడు ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇంటి లోపలి లొకేషన్, లోపలికి వెళ్లే మార్గం మరియు ఖరీదైన వస్తువులు ఎక్కడ ఉంచారు అనేది వారికి సులభంగా తెలిసిపోయింది. సీసీటీవీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో వ్లాగ్‌లో చెప్పడమే ఆమె చేసిన అతిపెద్ద పొరపాటని, అందుకే దొంగలు వాటికి దొరకకుండా తప్పించుకోగలిగారని పోలీసులు చెబుతున్నారు.

Leave a Reply