యూపీ 2027 ఎన్నికలపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు: “అఖిలేష్ గారూ.. కంగారు పడకండి, కానీ విజయం మాత్రం మాదే!”

న్యూఢిల్లీ:ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధతకు ఆయన తెరదించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాత సీట్లపైనే 2027 పోరు!
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే యూపీలో సీట్ల సంఖ్య మారుతుందని వస్తున్న వార్తలపై హోంమంత్రి స్పష్టత ఇచ్చారు. “2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలు పాత నియోజకవర్గాల ప్రాతిపదికన, పాత సీట్ల సంఖ్య ప్రకారమే జరుగుతాయి. 2029 వరకు దేశంలో జరిగే ఏ ఎన్నికలైనా పాత వ్యవస్థ ప్రకారమే కొనసాగుతాయి. కాబట్టి అఖిలేష్ గారు భయపడాల్సిన అవసరం లేదు” అని అమిత్ షా పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఆయన చిరునవ్వుతో.. “మీరు భయపడాల్సిన పనిలేదు కానీ, ఆ ఎన్నికల్లో మీరు గెలవరు అనేది మాత్రం వాస్తవం” అంటూ రాజకీయ విమర్శలు గుప్పించారు.

అఖిలేష్ యాదవ్ ఆరోపణలు ఏమిటి?
కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ అంతకుముందు లోక్‌సభలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. “యూపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 500 దాటుతుందని, లోక్‌సభ సీట్లు 120కి పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం ఏవైనా రాజకీయ కుట్రలకు పాల్పడుతోందా? అయోధ్యలో ఓడిపోయినట్లుగానే, మరోసారి యూపీలో బీజేపీకి పరాభవం తప్పదు” అని అఖిలేష్ హెచ్చరించారు.

పెరగనున్న సీట్ల సంఖ్య?
ఒకవేళ 2026 నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అమల్లోకి వస్తే, ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ప్రస్తుతం ఉన్న 403 అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏకంగా 605కి పెరిగే అవకాశం ఉంది. అలాగే లోక్‌సభ స్థానాల సంఖ్య 80 నుంచి 120కి చేరవచ్చు. అయితే, ఈ మార్పులన్నీ 2027 ఎన్నికల తర్వాతే అమలులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేయడంతో ప్రస్తుతానికి ఉత్కంఠకు తెరపడింది.


Posted

in

by

Tags: