యూపీఐ (UPI) యూజర్లకు షాక్.. ఇకపై రూ. 10,000 పంపితే గంట ఆగాల్సిందే! ఆన్‌లైన్ ఫ్రాడ్స్‌కు చెక్ పెట్టేలా ఆర్బీఐ కొత్త ప్లాన్!

ముంబై/న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యుగంలో భారతీయులకు అత్యంత ఇష్టమైన ‘యూపీఐ’ (UPI) సేవల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ మార్పులు చేయబోతోంది. కనురెప్పపాటులో నగదు బదిలీ అయ్యే వేగానికి ఆర్బీఐ కాస్త ‘బ్రేక్’ వేయాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ మోసాల వల్ల సామాన్యులు వేల కోట్లు నష్టపోతుండటంతో, వారి కష్టార్జితాన్ని కాపాడేందుకు ‘కూలింగ్ పీరియడ్’ (Cooling Period) అనే కొత్త నిబంధనను ప్రతిపాదించింది.

ఏమిటీ కొత్త రూల్? ఎందుకు?

ఆర్బీఐ తాజా ప్రతిపాదన ప్రకారం.. మీరు ఎవరికైనా యూపీఐ లేదా IMPS ద్వారా రూ. 10,000 కంటే ఎక్కువ నగదు పంపితే, అది అవతలి వ్యక్తికి వెంటనే అందదు.

  • గంట సేపు వెయిటింగ్: ఈ ట్రాన్సాక్షన్‌పై 1 గంట పాటు హోల్డింగ్ పీరియడ్ విధిస్తారు. అంటే మీరు పంపిన డబ్బు అవతలి వ్యక్తి ఖాతాలో జమ కావడానికి 60 నిమిషాల సమయం పడుతుంది.
  • ఎందుకు?: 2025లో డిజిటల్ ఫ్రాడ్స్ వల్ల భారతీయులు ఏకంగా రూ. 22,000 కోట్లు నష్టపోయారు. మోసగాళ్లు భయపెట్టో, ఆశ చూపించో అత్యవసరంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటారు. ఆ గంట సమయం ఉంటే, బాధితుడు తేరుకుని ఆ ట్రాన్సాక్షన్‌ను క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది.
  • సూచనలకు గడువు: ఈ ప్రతిపాదనపై మే 8, 2026 వరకు ఆర్బీఐ ప్రజల సలహాలను కోరింది. ఆ తర్వాత తుది మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
మరిన్ని కీలక మార్పులు:
  1. కిల్ స్విచ్ (Kill Switch): మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే, ఒకే ఒక్క బటన్ నొక్కడం ద్వారా యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ సేవలను తక్షణమే నిలిపివేసే సదుపాయం రానుంది.
  2. వృద్ధులకు రక్షణ: 70 ఏళ్లు పైబడిన వారు రూ. 50,000 కంటే ఎక్కువ పంపిస్తే, వారు నమ్మిన మరో వ్యక్తి (Trusted Person) అనుమతి ఉంటేనే ఆ నగదు బదిలీ అవుతుంది.
  3. భారీ డిపాజిట్లపై నిఘా: చిన్న వ్యాపార లేదా వ్యక్తిగత ఖాతాల్లో అకస్మాత్తుగా రూ. 25 లక్షల కంటే ఎక్కువ జమ అయితే, బ్యాంకులు పూర్తి విచారణ చేసిన తర్వాతే ఆ డబ్బును క్రెడిట్ చేస్తాయి.

Posted

in

by

Tags: