చైనాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ బొద్దింక జాతికి చెందిన కీటకాలను నూనెలో వేయించి, వాటిని తీపి పదార్థాలు (స్వీట్లు), గుడ్ల మీద పెట్టి విక్రయిస్తుండటం ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్ర వైరల్గా మారింది.
దక్షిణ చైనాలోని షుండే నగరంలో నడుస్తున్న ఈ రెస్టారెంట్లో ‘వాటర్ రోచ్ ఎగ్ టార్ట్స్’ (Water Roach Egg Tarts) పేరుతో ఈ వింత వంటకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఒక పూర్తి కీటకాన్ని నూనెలో వేయించి వినియోగదారులకు అందిస్తున్నారు.
చైనాలో ఈ రకమైన కీటకాలను స్థానిక ప్రత్యేక వంటకంగా పరిగణించడంతో పాటు, ఆ దేశ సాంప్రదాయ సంస్కృతి, వైద్య చికిత్సలలో కూడా వీటిని చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా, ఈ కీటకాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు, రక్తపు గడ్డలను తొలగించి, చర్మానికి, మూత్రపిండాలకు (కిడ్నీలకు) పోషణ అందిస్తాయని వారు నమ్ముతారు. అంతేకాకుండా, కండరాలు, ఎముకలను దృఢంగా మార్చేందుకు కూడా ఈ కీటకాలు సహాయపడతాయని స్థానికులు భావిస్తున్నారు.
తీపి, కారం రుచులతో గుడ్ల పైన ఈ కీటకాలను పెట్టి అమ్ముతున్న ఈ వింత వంటకం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఒక నెటిజన్.. “దాన్ని తినడం పక్కన పెడితే, కనీసం దాన్ని చూడటమే నా వల్ల కావడం లేదు” అని షాక్ వ్యక్తం చేశారు. మరొకరు స్పందిస్తూ.. “నేను వాటిని రుచి చూడలేదు కానీ, చైనా వైద్య చికిత్సలలో బొద్దింకలను విరివిగా ఉపయోగిస్తారు” అని పేర్కొన్నారు.

Leave a Reply