ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో సమీపంలో సెల్ఫోన్ నెలవారీ వాయిదా (EMI) చెల్లించలేకపోయిన ఒక కార్మికుడిని రికవరీ ఏజెంట్లు 5 రోజుల పాటు బందీగా ఉంచిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది.
ఆ ఐదు రోజులూ అతనిపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా, బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకున్నట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా, అతని శరీరం నుంచి బలవంతంగా ఒక యూనిట్ రక్తాన్ని కూడా తీసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం EMI చెల్లించనందుకు ఇంతటి అమానుష చర్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
సెల్ఫోన్ కొనుగోలు చేసిన సదరు కార్మికుడు గడువులోగా వాయిదా సొమ్మును చెల్లించలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు వ్యక్తులు అతన్ని తీసుకెళ్లి ఓ ప్రదేశంలో ఐదు రోజుల పాటు నిర్బంధించారు. అక్కడ తనపై దాడి చేసి, బలవంతంగా పనులు చేయించుకున్నారని బాధితుడు తెలిపాడు. అంతేకాకుండా, బాధితుడి కుటుంబ సభ్యులను ఫోన్లో బెదిరించి రూ. 2,799 నగదును తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతని కోసం గాలిస్తూ, పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు 5వ రోజున ఆ కార్మికుడిని ర్యాపిడో బైక్ ట్యాక్సీలో ఇంటికి పంపించివేశారు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ బాధితుడి తల్లి, సోదరుడు స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అయితే అక్కడ పోలీసులు వెంటనే ఎలాంటి చర్యా తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దీంతో బాధితుడి కుటుంబం ఉన్నతాధికారులను ఆశ్రయించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదు చేశారు. ఈఎంఐ చెల్లించలేదని కార్మికుడిని బంధించి కొట్టడమే కాకుండా, బలవంతంగా రక్తం తీసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
