ఈజిప్ట్‌లోని గిజా ప్రాంతంలో ఉన్న అర్ద్ ఎల్-లెవా అనే రద్దీ వీధిలో, సెప్టెంబర్ 29న జరిగిన ఒక సంఘటన మొత్తం ఇంటర్నెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.
ఆ రోజు ఎప్పటిలాగే జనం అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో, అకస్మాత్తుగా పై అంతస్తు నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. ఏం జరుగుతోందో అని జనం తలెత్తి చూసేలోపే, అక్కడి ఒక భవనం బాల్కనీలోంచి 5 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.
అప్పుడు ఆ ప్రాంతంలో తన దుకాణం దగ్గర నిలబడి ఉన్న అహ్మద్ రజబ్ అనే యువకుడు, అరుపులు విని వెంటనే పైకి చూశాడు. తర్వాతి కొన్ని క్షణాల్లోనే బాలుడు పైనుంచి కిందకు పడిపోవడాన్ని గమనించి, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మెరుపు వేగంతో దూసుకెళ్లి తన రెండు చేతులను చాచి, బాలుడు నేలకేసి గుద్దుకోకముందే అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు.
బాలుడు కింద పడిన ప్రదేశం, ఆ ప్రాంతంలోని ఇరుకైన సందు దృష్ట్యా ఒక్క క్షణం ఆలస్యమైనా పెను ప్రమాదం జరిగి ఉండేది. కానీ, అహ్మద్ రజబ్ సమయస్ఫూర్తి, అసాధారణ వేగం ఆ బాలుడి ప్రాణాలను కాపాడాయి.
ఈ ఘటన గురించి అహ్మద్ రజబ్ మాట్లాడుతూ, ‘అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించడానికి కూడా నాకు సమయం లేదు. ఒక బాలుడు పైనుంచి కింద పడిపోవడం చూడగానే నా అంతరాత్మ చెప్పిందే నేను చేశాను. అతడిని పట్టుకుని కాపాడిన తర్వాతే అసలు ఏం జరిగిందో నాకు అర్థమైంది’ అని భావోద్వేగంతో చెప్పాడు. ప్రమాదం తప్పిన తర్వాత, ఆందోళన మరియు విపరీతమైన భయంతో అతను పక్కనే ఉన్న పరుపుపై వాలిపోయి స్థిమితపడే దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
‘మరోసారి ఇలాంటి పరిస్థితే వస్తే నేను మళ్ళీ ఇలా చేయగలనో లేదో నాకే తెలియదు’ అని అతను ఆశ్చర్యంగా అన్నాడు. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదకరమైన సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా దూసుకెళ్లి ఒక పసికందు ప్రాణాలను కాపాడిన అహ్మద్ రజబ్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ‘రియల్ హీరో’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply