వాషింగ్టన్: లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన కీలక పత్రాలను (ఫైల్స్) అమెరికా కోర్టు నిరంతరం విడుదల చేస్తోంది. ఈ ఫైళ్లలో అంతర్జాతీయ స్థాయిలో పలువురు ధనవంతులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు కూడా ఇందులో చిక్కుకుంది. ఈ వ్యవహారంపై బిల్ గేట్స్ తన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు.
బిల్ గేట్స్ క్షమాపణలు కోరినట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఒక నివేదికను ప్రచురించింది. గత మంగళవారం జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఆయన ఈ వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఎవరీ ఎప్స్టీన్?
చిన్నారి బాలికలను అపహరించి, ప్రపంచంలోని ధనవంతులకు, రాజకీయ నాయకులకు విక్రయిస్తూ లైంగిక వ్యాపారాన్ని నిర్వహించిన వ్యక్తి ఎప్స్టీన్. అతను ప్రస్తుతం జీవించి లేడు. అయితే, అతనికి సంబంధించిన అన్ని ఫైళ్లను బహిరంగపరచాలని అమెరికా పార్లమెంటులో తీర్మానం ఆమోదించబడింది. దీంతో అమెరికా న్యాయశాఖ వరుసగా ఈ వివరాలను వెల్లడిస్తోంది.
సంచలన విషయాలు
ఈ ఫైళ్లలో అనేకమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. అందులో బిల్ గేట్స్ ఒకరు. ఆయనకు రష్యన్ మహిళలతో సంబంధం ఉందని, దీనివల్ల ఆయన లైంగిక వ్యాధి బారిన పడ్డారని, తన భార్యకు తెలియకుండా దానిని నయం చేయగలరా? అని ఎప్స్టీన్ను బిల్ గేట్స్ అడిగినట్లు ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపైనే బిల్ గేట్స్ ఇప్పుడు స్పందించారు.
బిల్ గేట్స్ వివరణ
తన ఉద్యోగులతో మాట్లాడిన బిల్ గేట్స్.. తనకు ఇద్దరు రష్యన్ మహిళలతో వివాహేతర సంబంధం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.
- బ్రౌజ్ (Bridge) ఆట ఆడుతున్నప్పుడు పరిచయమైన ఒక రష్యన్ క్రీడాకారిణితో,
- వ్యాపార కార్యకలాపాల ద్వారా పరిచయమైన ఒక రష్యన్ అణు భౌతిక శాస్త్రవేత్తతో (Nuclear Physicist) సంబంధం ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారు.
వివాహేతర సంబంధంపై పశ్చాత్తాపం
“ఎప్స్టీన్తో సమయం గడపడం నేను చేసిన పెద్ద తప్పు. నా వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ క్షమాపణలు కోరుతున్నాను. ఎప్స్టీన్ ఫైళ్లలో ముఖాలు కనబడని మహిళలతో నేను ఉన్న ఫోటోలు ఉన్నాయి. తన సహాయకులతో కలిసి ఆ ఫోటోలు దిగమని ఎప్స్టీన్ అడగడం వల్లే నేను దిగాను. అయితే, నేను ఎప్పుడూ బాధితులతో గానీ, అతని చుట్టూ ఉన్న మహిళలతో గానీ సమయం గడపలేదు” అని బిల్ గేట్స్ వివరించారు.
విలువలకి విరుద్ధం
“ఎప్స్టీన్తో నాకు ఉన్న సంబంధం మా ఫౌండేషన్ విలువలకు, లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. మా పని గౌరవప్రదమైనది మరియు సున్నితమైనది. ప్రజలు మాతో కలిసి పనిచేయాలా వద్దా అనేది వారి ఇష్టం” అని ఆయన పేర్కొన్నారు.
బిల్ గేట్స్ 2011 నుండి ఎప్స్టీన్ను కలవడం ప్రారంభించారు. అయితే, ఎప్స్టీన్ 2008లోనే బాలికలను వ్యభిచారంలోకి దించినందుకు జైలు శిక్ష అనుభవించాడు. దీనిపై వివరణ ఇస్తూ.. ఎప్స్టీన్ నేపథ్యాన్ని తాను సరిగ్గా విచారించలేదని, అతని శిక్ష మరియు ప్రయాణ ఆంక్షల గురించి తనకు పూర్తి వివరాలు తెలియవని బిల్ గేట్స్ చెప్పారు.
