రష్యా చమురుపై యూరప్ కీలక నిర్ణయం.. భారత్ ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది, ఇక పండగే!

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మండుతున్న వేళ, ఐరోపా నుండి ఒక ఉపశమన వార్త అందింది. ఇది గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్ వంటి పెద్ద చమురు కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. రష్యన్ చమురుపై కఠినం కావాలని భావించిన యూరోపియన్ యూనియన్ (EU) ఒక అడుగు వెనక్కి తగ్గింది.

భారత్‌కు ఎలా లాభం? భారత్ ప్రస్తుతం రష్యా నుండి తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేస్తోంది. ఈ చమురును మన దేశంలోని రిఫైనరీలలో శుద్ధి చేసి, దాని ద్వారా తయారైన పెట్రోకెమికల్ ఉత్పత్తులను తిరిగి ఐరోపా మార్కెట్లలో విక్రయిస్తోంది. ఈ వ్యాపారం ద్వారా భారత చమురు కంపెనీలు భారీ లాభాలను గడిస్తున్నాయి. ఏప్రిల్ 15న రష్యన్ చమురుపై యూరప్ శాశ్వత నిషేధం విధించి ఉంటే, ఈ వ్యాపార మార్గం మూసుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదన వాయిదా పడటంతో భారత రిఫైనరీలకు ‘బల్లే-బల్లే’ (పండగ) అని చెప్పవచ్చు.

యూరప్ ఎందుకు వెనక్కి తగ్గింది? దీనికి ప్రధాన కారణం ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రకారం, ఈ యుద్ధం చరిత్రలోనే అతిపెద్ద చమురు సరఫరా సంక్షోభాన్ని సృష్టించింది. ఒకవైపు హోర్ముజ్ జలసంధి మూతపడటం, మరోవైపు రష్యాపై కూడా నిషేధం విధిస్తే చమురు ధరలు నియంత్రణ కోల్పోతాయని యూరప్ భయపడింది. అందుకే తన ఏప్రిల్ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

యూరప్ అసలు ప్లాన్ ఏమిటి? 2027 చివరి నాటికి రష్యా నుండి చమురు దిగుమతులను సున్నాకు తగ్గించాలని యూరప్ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఉక్రెయిన్ యుద్ధం ముగిసినా, రష్యాపై ఆంక్షలు తొలగించినా సరే.. శాశ్వతంగా రష్యా నుండి చమురు కొనకూడదనే కఠిన చట్టాన్ని తీసుకురావాలని భావించింది. హంగేరీ వంటి దేశాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

భారత సామాన్యుడికి ఊరట: ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఉన్న తరుణంలో యూరప్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌పై ఒత్తిడి తగ్గింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు కొంత స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇది భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగకుండా అడ్డుకుంటుంది, తద్వారా సామాన్యుడి జేబుకు ఉపశమనం లభిస్తుంది.


Posted

in

by

Tags: