రాజస్థాన్: ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి సమీపంలో పాల ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.
రహదారి పక్కన ఉన్న లోతైన గుంతలోకి ట్యాంకర్ తలకిందులుగా పడిపోవడంతో, అందులోని వేల లీటర్ల పాలు రోడ్డుపై ఏరులై పారాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ధ్వంసమైన ట్యాంకర్ లో చిక్కుకున్న డ్రైవర్‌ను రక్షించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, రోడ్డుపై పాలు ప్రవహించడం చూసిన చుట్టుపక్కల ప్రజలు, తమ ఇళ్లలోని బకెట్లు, క్యాన్లు, సీసాలు మరియు పాత్రలతో ప్రమాద స్థలానికి పరుగులు తీశారు. ట్యాంకర్ నుండి కారుతున్న పాలను పట్టుకోవడానికి జనం పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడటం, పాలను సేకరించడానికి ప్రజలు గుమిగూడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గుమిగూడిన జనాన్ని చెదరగొట్టి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం బోల్తా పడిన ట్యాంకర్ ను అక్కడి నుండి తొలగించారు. అతివేగం వల్లా, డ్రైవర్ అలసట వల్లా లేక సాంకేతిక లోపం వల్లా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
