ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో రాఖీ సావంత్ అంటే ఒక సంచలనం. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా, ఫిల్టర్ లేకుండా మాట్లాడటం ఆమె నైజం. తన జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ వెనకడుగు వేయని రాఖీ, ఒక పాత ఇంటర్వ్యూలో తన కెరీర్ స్ట్రగుల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ అవకాశాలు రాలేదు: తన స్ట్రగుల్ రోజులను గుర్తు చేసుకుంటూ రాఖీ ఇలా చెప్పుకొచ్చారు.. “అంబానీ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో నేను క్యాటరింగ్ సర్వర్‌గా పనిచేశాను. అప్పుడు నాకు రోజుకు కేవలం 100 రూపాయలు వచ్చేవి. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాను, కానీ ఎవరూ నాకు అవకాశాలు ఇవ్వలేదు. అప్పట్లో హీరోయిన్లు బోల్డ్ పాత్రలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. కానీ నా కుటుంబ బాధ్యతలు నాపై ఉన్నాయి.”
కుటుంబం కోసం బోల్డ్‌గా మారాను: “మా అమ్మ హాస్పిటల్ బిల్లులు కట్టాలి, తమ్ముడు-చెల్లెళ్ల కాలేజీ ఫీజులు చెల్లించాలి, ఇంట్లో కిచెన్‌లో పప్పు బియ్యం ఉండాలి అంటే నాకు డబ్బు అవసరం. అందుకే నా పద్ధతి మార్చుకున్నాను. నేను బోల్డ్‌గా మారాను, ఐటెం సాంగ్స్ చేశాను. ఆ సమయంలో నా బోల్డ్నెస్ చూసి జనం ఆశ్చర్యపోయేవారు. కానీ నా కష్టాలు వారికి తెలియవు.”
నేను ఎవరి పడక గదికి వెళ్లలేదు: ఈ ఇంటర్వ్యూలో రాఖీ ఒక అత్యంత షాకింగ్ విషయాన్ని చెప్పారు. “నేను బాలీవుడ్లో నన్ను నేను అమ్ముకున్నాను. కానీ తప్పుడు మార్గంలో కాదు. నా శరీరాన్ని వెండితెరపై ప్రదర్శించాను (బోల్డ్‌గా నటించాను), కానీ అవకాశాల కోసం ఎవరి పడక గదిలోకి వెళ్లలేదు. షార్ట్‌కట్ మార్గాలను ఎంచుకోలేదు. స్క్రీన్‌పై బోల్డ్‌గా కనిపించాను కానీ ఎవరి బిస్తర్ (బెడ్) వేడి చేయలేదు. ఇది వినడానికి బాగుండకపోవచ్చు కానీ ఇదే నిజం.”
రాకేశ్ బాపట్‌పై ప్రేమ: మరోవైపు, నటుడు రాకేశ్ బాపట్‌పై తనకున్న ఇష్టాన్ని కూడా రాఖీ బయటపెట్టారు. “ప్రారంభంలో రాకేశ్ నన్ను ఇష్టపడుతున్నట్లు మాట్లాడేవారు. అందరి ముందు నన్ను ‘కొత్త వదిన’ అని ఆటపట్టించేవారు. నేను అది నిజమని నమ్మి అతనికి మనసిచ్చాను. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి, అతను వెనక్కి తగ్గాడు. నా ప్రేమ కేవలం ఒక వైపు మాత్రమే మిగిలిపోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
