రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేత పదవి నుండి రాఘవ్ చడ్డాను తొలగించినప్పటి నుండి, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై చర్చ మొదలైంది. సభలో ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని రాఘవ్‌పై ఆప్ సీనియర్ నేతలు ఆరోపణలు గుప్పించారు.
ఈ క్రమంలో ఆప్ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ సుమారు ఏడాదిన్నర క్రితం చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన రాఘవ్ చడ్డాపై చర్యలు తీసుకుంటారని ముందే జోస్యం చెప్పారు.
ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ.. “ఆమ్ ఆద్మీ పార్టీలో తర్వాతి బలి పశువు ఎవరు? ఆ అబ్బాయే (రాఘవ్ చడ్డా). అతనికి సొంతంగా పెద్ద పలుకుబడి లేకపోయినా, బాగా పాపులర్ అయ్యాడు. ఒక హీరోయిన్ (పరిణీతి చోప్రా)ను పెళ్లి చేసుకున్నాడు. రీల్స్ (వీడియోలు)లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. కానీ కేజ్రీవాల్ పార్టీలో ఇది పనికిరాదు. అతని పెళ్లి జరిగినప్పుడే నేను చెప్పాను.. ఇతని పని అయిపోయింది, కేజ్రీవాల్ ఇతనిని వదలరు అని. ఎందుకంటే ఎవరైనా తనకంటే ఎక్కువ వెలుగులోకి వస్తే కేజ్రీవాల్ తట్టుకోలేరు” అని వ్యాఖ్యానించారు.
నన్ను మౌనంగా ఉంచారు కానీ నేను ఓడిపోలేదు: రాఘవ్ చడ్డా పార్టీ నేతల ఆరోపణలపై రాఘవ్ చడ్డా స్పందిస్తూ.. “నేను ఎప్పుడూ సభలో ప్రజల సమస్యలనే లేవనెత్తాను. టోల్ ప్లాజాల దోపిడీ, పన్నులు, ఆహార కల్తీ వంటి అంశాలపై మాట్లాడటం నేరమా? దీనివల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? నన్ను మౌనంగా ఉంచారు కానీ, నేను ఓడిపోలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందన: ఈ వివాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. “ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. పార్లమెంటులో నేతలను, ఉపనేతలను మార్చడం సహజం. సభలో విపక్షాలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు (వాకౌట్ వంటివి), ఎవరైనా పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
బీజేపీ విమర్శలు: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందిస్తూ.. కేజ్రీవాల్ నాయకత్వం విమర్శలను భరించలేదని, అందుకే రాఘవ్ చడ్డాపై సొంత పార్టీ నేతలతోనే ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు.
