ఐపీఎల్ (IPL 2026) సీజన్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలోనే ఫ్రాంచైజీల విక్రయ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ (RCB)ని బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ₹16,700 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా, మరో ప్రముఖ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్లింది. మొదట అమెరికాకు చెందిన ఉమ్మడి పెట్టుబడిదారు కల్ సొమానీ ఈ జట్టును 1.63 బిలియన్ డాలర్లకు కొన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా ఆ ఊహాగానాలకు తెరపడింది.
కొత్త ఒప్పందం ప్రకారం.. భారత స్టీల్ దిగ్గజం లక్ష్మి మిట్టల్ కుటుంబం మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా కలిసి రాజస్థాన్ రాయల్స్ జట్టును 1.65 బిలియన్ డాలర్లకు (సుమారు ₹15,660 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులో మిట్టల్ కుటుంబం సింహభాగం అంటే 75% వాటాను దక్కించుకుంది.
డీల్ వివరాలు ఇలా ఉన్నాయి:
రాజస్థాన్ రాయల్స్ పాత యజమాని మనోజ్ బదాలే మరియు అతని భాగస్వాముల నుండి మిట్టల్, పూనావాలా బృందం ఈ జట్టును కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో కేవలం ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా, దక్షిణాఫ్రికాలోని పార్ల్ రాయల్స్, కరేబియన్‌లోని బార్బడోస్ రాయల్స్ జట్ల యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి.
లక్ష్మి మిట్టల్ కుటుంబం: 75% వాటా (జట్టుపై పూర్తి నియంత్రణ వీరిదే).
అదార్ పూనావాలా: 18% వాటా.
మనోజ్ బదాలే (పాత యజమాని): 7% వాటా.
ఈ డీల్ 2026 మూడవ త్రైమాసికంలో పూర్తి కానుంది. దీనికి బీసీసీఐ (BCCI) మరియు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది.
రాజస్థాన్ అంటే మిట్టల్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం:
లక్ష్మి నివాస్ మిట్టల్ రాజస్థాన్‌లోని సాదుల్పూర్ గ్రామంలో జన్మించారు. అందుకే ఈ కొనుగోలు ఆయనకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. “రాజస్థాన్ రాయల్స్ జట్టును సొంతం చేసుకోవడం నా కల. మా కుటుంబం రాజస్థాన్ మూలాలు ఉన్నవారు కాబట్టి ఈ ఫ్రాంచైజీలో భాగం కావడం కంటే అదృష్టం మరొకటి లేదు” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, కుమార్తె వనిషా మిట్టల్ కూడా బోర్డులో సభ్యులుగా ఉండనున్నారు.
అదార్ పూనావాలా కూడా స్పందిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ ఒక గొప్ప వారసత్వం ఉన్న జట్టు అని, దాని వృద్ధిలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఐపీఎల్ చరిత్రలో 2వ అతిపెద్ద డీల్:
రాజస్థాన్ రాయల్స్ విలువ పెరగడం ఐపీఎల్ బ్రాండ్ పవర్‌ను చూపిస్తోంది. ఇది ఐపీఎల్ చరిత్రలో 2వ అతిపెద్ద డీల్. మొదటి స్థానంలో ఆర్సీబీ (RCB) ఉంది. బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్లాక్‌స్టోన్ వంటి సంస్థలు కలిసి ఆర్సీబీని సుమారు ₹16,700 కోట్లకు కొనుగోలు చేశాయి.
ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ ప్రదర్శన:
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జట్టును ప్లే-ఆఫ్స్ దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రియాన్ పరాగ్ సారథ్యంలో యువ జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి పట్టికలో 4వ స్థానంలో ఉంది.
