ఫ్రాన్స్‌లోని కోర్సికా ద్వీపంలోని మోంటెమాగియోర్ గ్రామం వద్ద రాత్రి ఆకాశంలో ఎరుపు రంగులో మెరుపుల్లాంటి కాంతులు కనిపించాయి. ఆకాశంలో ఎర్రటి కొమ్మలు విస్తరించినట్టుగా, బాణసంచా పేలినట్టుగా కనిపించిన ఈ అరుదైన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఫ్లోరియన్ ర్యూ అనే ఫొటోగ్రాఫర్ ఈ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. మొదట సాధారణ మెరుపుల్లా కనిపించినప్పటికీ, ఇవి వాతావరణంలోని పై పొరల్లో ఏర్పడే ‘రెడ్ స్ప్రైట్స్’ (Red Sprites) అనే అరుదైన విద్యుత్ కాంతి దృగ్విషయమని సమాచారం.
ఈ కాంతులు ఫ్రాన్స్‌లోని గ్రామం పైనే ఏర్పడినట్లు కనిపించినా, వాటికి కారణమైన తుపాను అక్కడికి వందల కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు తెలుస్తోంది. స్పెయిన్‌లోని బార్సిలోనా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుపానుల కారణంగా ఈ కాంతులు కనిపించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
అసలు ‘రెడ్ స్ప్రైట్స్’ అంటే ఏమిటి?
సాధారణంగా మనం చూసే మెరుపులు మేఘాల మధ్య లేదా మేఘాల నుంచి భూమి వైపు సంభవిస్తాయి. కానీ రెడ్ స్ప్రైట్స్ మాత్రం భూమి ఉపరితలం నుంచి సుమారు 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మెసోస్ఫియర్ అనే వాతావరణ పొరలో ఏర్పడతాయి.
ఉరుములతో కూడిన బలమైన తుపానుల సమయంలో జరిగే విద్యుత్ చర్యల వల్ల వాతావరణంలోని నైట్రోజన్ అణువులు ఉత్తేజితమవుతాయి. ఫలితంగా ఎరుపు రంగులో కాంతి వెలువడుతుంది. ఈ కాంతి కొన్ని మిల్లీసెకన్ల పాటు మాత్రమే కనిపిస్తుంది. అందుకే వీటిని కళ్లతో గమనించడం, కెమెరాలో బంధించడం చాలా అరుదు.
వందల కిలోమీటర్ల దూరంలో వచ్చిన తుపాను.. ఇక్కడ కనిపించిన కాంతులు!
తుపాను ఏర్పడే పరిస్థితులను ముందుగానే గమనించిన ఫొటోగ్రాఫర్, గ్రామంతో పాటు రాత్రి ఆకాశం కూడా ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు. దీంతో ఈ అరుదైన సహజ దృగ్విషయం కెమెరాకు చిక్కింది.
ఆకాశంలో ఎర్రటి కొమ్మల్లా విస్తరించిన ఈ కాంతులు చూడటానికి అద్భుతంగా ఉన్నప్పటికీ, వీటికి గ్రహాంతరవాసులతో లేదా ఏదైనా అతీంద్రియ శక్తులతో సంబంధం లేదు. ఉరుములతో కూడిన తుపానులు, భూమి పై వాతావరణ పొరల మధ్య జరిగే విద్యుత్ చర్యల వల్ల ఏర్పడే సహజ దృగ్విషయమే ఇది.
ప్రస్తుతం ఫ్రాన్స్ ఆకాశంలో కనిపించిన ఈ అరుదైన ఎర్రటి కాంతుల దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Leave a Reply