లండన్: కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాట్లు ఊహించని వింత పరిస్థితులకు దారితీస్తాయి. బ్రిటన్కు చెందిన 42 ఏళ్ల టామీ లించ్ అనే వ్యక్తికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నిద్రలేవగానే తన శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోవడం చూసి అతను ప్రాణభయంతో ఆసుపత్రికి పరుగులు తీశాడు. తీరా అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలిసి వైద్యులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
ఏం జరిగిందంటే?
టామీకి అతని స్నేహితుడు సుమారు 5 వేల రూపాయల విలువైన ‘నేవీ బ్లూ’ రంగు కింగ్-సైజ్ బెడ్షీట్లను బహుమతిగా ఇచ్చాడు. టామీ ఉత్సాహంతో ఆ కొత్త చాదర్లను ఉతకకుండానే మంచంపై పరుచుకున్నాడు. వరుసగా రెండు రాత్రులు ఆ బెడ్షీట్పైనే పడుకున్నాడు. మూడవ రోజు మధ్యాహ్నం నిద్రలేచి అద్దంలో చూసుకునేసరికి, తల నుండి కాళ్ల వరకు అతని శరీరం మెరిసిపోయే ‘నీలం’ రంగులోకి మారిపోయింది.
దీనికి తోడు అతనికి బాగా అలసటగా అనిపించడంతో, ఏదో తీవ్రమైన అనారోగ్యం సోకిందని భయపడి అతని స్నేహితుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ఆసుపత్రిలో హైడ్రామా:
టామీ పరిస్థితి చూసిన డాక్టర్లు కూడా మొదట కంగారుపడ్డారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి ఇలా నీలంగా మారిందేమోనని భావించి, అతనికి వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. రకరకాల పరీక్షలు చేయడానికి సిద్ధమయ్యారు.
అయితే, ఒక డాక్టర్ అనుమానంతో టామీ చేతిని ‘ఆల్కహాల్ వైప్’ (Alcohol Wipe) తో తుడిచారు. ఆశ్చర్యకరంగా, ఆ తుడిచిన వైప్ నీలం రంగులోకి మారింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ కొత్త బెడ్షీట్కు ఉన్న గాఢమైన రంగు (Dye), టామీ శరీరానికి ఉన్న తేమ/చెమట వల్ల అతని చర్మానికి అంటుకుపోయింది.
నవ్వుల పువ్వులు పూయించిన ‘నీలం’ మనిషి:
అసలు కారణం తెలియగానే ఆసుపత్రి సిబ్బంది అంతా నవ్వుకున్నారు. టామీ కూడా చాలా సిగ్గుపడి వైద్యులకు క్షమాపణలు చెప్పాడు. “కొత్త బట్టలు లేదా బెడ్షీట్లు వాడేముందు ఖచ్చితంగా ఉతకాలని నాకు తెలియదు. ఎమర్జెన్సీ వార్డులో అందరూ నన్ను ఏదో వింత జీవిని చూసినట్లు చూశారు” అని అతను వాపోయాడు.
ఇంటికి వెళ్ళాక కూడా ఆ రంగు అంత త్వరగా వదలలేదు. వారం రోజుల పాటు పదే పదే స్నానం చేస్తే కానీ ఆ నీలం రంగు పూర్తిగా పోలేదు. ఏది ఏమైనా, కొత్త వస్తువులను నేరుగా వాడకూడదని టామీకి ఈ ఘటనతో బాగా బుద్ధి వచ్చింది.
