రాత్రి ప్రియురాలిని కలవడానికే కదా వెళ్ళాడు!.. గ్రామస్తులకు దొరికిపోవడంతో కథ అడ్డం తిరిగింది. మరుసటి రోజే ప్రియురాలి నుదుటన సిందూరం!.. ప్రేమికుడిగా వెళ్ళినవాడు భర్తగా తిరిగి వచ్చాడు.!!!

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అర్ధరాత్రి వేళ ప్రియురాలిని రహస్యంగా కలిసేందుకు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది.

బోచహాన్‌ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఆ యువకుడికి, అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ దాదాపు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ప్రియురాలిని కలిసేందుకు ఆ యువకుడు ఆమె గ్రామానికి వెళ్లాడు. ఎవరికీ తెలియకుండా కలిసి వెనక్కి వచ్చేయవచ్చని అతను భావించాడు. కానీ, అతడు వచ్చిన విషయం గ్రామస్తులకు తెలియడంతో పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది.

యువకుడు ప్రియురాలి ఇంటి పరిసరాల్లో ఉన్నాడని తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారిద్దరినీ పట్టుకున్న గ్రామస్తులు.. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో మరుసటి రోజు ఆ యువతి ఇంట్లోనే వివాహానికి ఏర్పాట్లు చేశారు. మహిళలు పెళ్లి పాటలు పాడుతుండగా, గ్రామస్తుల సమక్షంలో యువకుడు ఆ యువతి నుదుటన సిందూరం పెట్టి తాళి కట్టాడు. అలా రాత్రి వేళ ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు, తెల్లారేసరికి భర్తగా మారిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

అక్కడున్న వారిలో ఒకరు ఈ తతంగాన్నంతా వీడియో తీయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామస్తులు చుట్టూ చేరి ఉండటం, వారిద్దరూ పక్కపక్కనే కూర్చోవడం, వివాహ వేడుకలు జరగడం అందులో కనిపించాయి. కాగా, వీరిద్దరికీ బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే సమాచారం అందుకున్న అహియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ యువతీయువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో మొదలైన పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

పోలీస్ స్టేషన్‌లో వారి వయసుపై ఆరా తీయగా, ఇద్దరూ మేజర్లని తేలింది. అంతేకాకుండా, తామిద్దరం ఇష్టపూర్వకంగానే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని వారు పోలీసులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారం, స్థానిక ప్రజాప్రతినిధి సమక్షంలో బాండ్ పేపర్‌పై సంతకాలు తీసుకుని వారిని విడుదల చేశారు. సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి, రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా కలవబోయి దొరికిపోవడం, చివరకు మరుసటి రోజే పెళ్లికి దారితీసిన ఈ ఘటన ప్రస్తుతం బీహార్‌తో పాటు నెట్టింట వైరల్‌గా మారింది.


Posted

in

by

Tags: