విదర్భ , మెహకర్: కదులుతున్న లగ్జరీ బస్సులో డ్రైవర్ మరియు క్లీనర్ మొబైల్లో రీల్స్ చేయాలనే పిచ్చితో ప్రదర్శించిన నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో కేవలం ఏడాదిన్నర వయసున్న పసిబాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన ఆదివారం (ఏప్రిల్ 19) తెల్లవారుజామున 5:48 గంటల సమయంలో మెహకర్ సమృద్ధి మహామార్గ్లోని ఫర్దాపూర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగింది.
ముంబై నుండి పుసద్ వెళ్తున్న బంజారా ట్రావెల్స్ లగ్జరీ బస్సు (MH 29 BE 2333) ఆదివారం తెల్లవారుజామున మెహకర్ తాలూకాకు చేరుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 3 గంటల తర్వాత బస్సును వేరొక డ్రైవర్ నడపడం ప్రారంభించాడు. ఈ డ్రైవర్ బస్సు నడుపుతూనే మొబైల్లో పాటలు పెట్టుకుని రీల్స్ (వీడియోలు) చేయడం మొదలుపెట్టాడు. క్యాబిన్లో ఉన్న ప్రయాణికులు అతడిని పదేపదే హెచ్చరించినప్పటికీ అతను పట్టించుకోలేదు. ఫర్దాపూర్ టోల్ ప్లాజా సమీపంలోని మలుపు వద్ద బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పియూష్ యశ్పాల్ రాథోడ్ (18 నెలలు) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
బస్సు బోల్తా పడుతూ ఎదురుగా వస్తున్న కారును కూడా ఢీకొట్టింది. కారులో ఉన్న రూప్‌చంద్ బావన్కులే కుటుంబం కూడా గాయపడింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను మెహకర్ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు.
డాక్టర్లు లేకపోవడంతో ప్రజల ఆగ్రహం క్షతగాత్రులను మెహకర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ అరగంట వరకు ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం గమనార్హం. కేవలం నర్సులు, అటెండర్లు మాత్రమే ప్రాథమిక చికిత్స అందించారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు ఇంట్లో ఉన్నారని తెలియడంతో ప్రయాణికుల బంధువులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
