రూ. 1.5 లక్షల అప్పుకు రూ. 11 లక్షల వడ్డీ.. బెంగళూరులో మహిళను కిడ్నాప్ చేసి వివస్త్రను చేసి వీడియోలు: వెలుగులోకి దిగ్భ్రాంతికర నిజాలు..!

బెంగళూరులో రూ. 1.5 లక్షల అప్పు వివాదంలో 30 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, రెండు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేసిన అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేపింది.

బాధిత మహిళ నషాత్ అనే వ్యక్తి వద్ద రూ. 50 వేలు, రేష్మా భాను అనే మహిళ వద్ద రూ. 1 లక్ష అప్పుగా తీసుకుంది. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో ఈఎంఐ వాయిదాలు చెల్లించలేకపోయింది. ఈ క్రమంలో ఆగస్టు 27 నుంచి 31 మధ్య చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఉద్యోగం విషయమై మాట్లాడాలని చెప్పి ఆ మహిళను రప్పించిన నిందితులు, ఆమెపై దాడి చేసి మొబైల్ ఫోన్‌ను పగులగొట్టారు. అనంతరం ఆమెను, ఆమె కుమారుడిని బలవంతంగా ఆటోలో ఎక్కించి కుంబల్‌గోడు ప్రాంతంలోని ఓ ఇంట్లోకి కిడ్నాప్ చేసి బంధించారు. అక్కడ ఆమె దుస్తులు విప్పేలా బలవంతం చేసి వీడియోలు చిత్రీకరించారు. తీసుకున్న అప్పుకు వడ్డీతో కలిపి మొత్తం రూ. 11 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి కొన్ని ఖాళీ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు.

చివరికి, టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ, నేరుగా పోలీసులను ఆశ్రయించి సహాయం కోరింది. ఈ ఘోరంపై కేసు నమోదు చేసుకున్న చంద్ర లేఅవుట్ పోలీసులు.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *