ప్రజల భద్రతను కాపాడాల్సిన పోలీసు అధికారే, అరెస్టు భయాన్ని చూపిస్తూ లంచం డిమాండ్ చేసిన దారుణం ముంబైలోని బోరివలి పోలీస్ స్టేషన్లో వెలుగుచూసింది.
కేసులో నిందితుడితో పాటు అతడి ఇద్దరు సోదరీమణులను అరెస్ట్ చేయకుండా ఉండటానికి రూ. 1.5 లక్షలు లంచం అడిగిన సబ్ ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ పరాడేను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బోరివలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 31 ఏళ్ల పీఎస్ఐ జ్ఞానేశ్వర్ పరాడే, విచారణ నిమిత్తం ఓ కేసుతో సంబంధమున్న యువకుడిని సంప్రదించాడు. “నువ్వు, నీ ఇద్దరు సోదరీమణులు ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలంటే నాకు రూ. 1.50 లక్షలు ఇవ్వాల్సిందే” అని బెదిరింపులకు దిగాడు.
ఆ తర్వాత జరిగిన బేరసారాల్లో ఆ మొత్తాన్ని తగ్గించి రూ. 1.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే, ఈ అధికార దుర్వినియోగానికి తలొగ్గడం ఇష్టంలేని ఆ యువకుడు వెంటనే ముంబై ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదులోని వాస్తవాలను ప్రాథమికంగా నిర్ధారించుకున్న ఏసీబీ అధికారులు, పక్కా వ్యూహంతో పోలీస్ స్టేషన్ సమీపంలోనే వల పన్నారు. యువకుడి నుంచి రూ. 1.30 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా చుట్టుముట్టి ఎస్ఐ జ్ఞానేశ్వర్ పరాడేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఓ సబ్ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం ముంబై పోలీస్ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర సంచలనం రేపింది.

Leave a Reply