“రూ.1000కే లైంగిక సేవలు!” “ఈ నంబర్‌కు కాల్ చేస్తే అశ్లీల ఫోటోలు వస్తాయి”.. 10, 20 రూపాయల నోట్లపై ప్రకటనలు.. వివాహితకు వరుస ఫోన్ కాల్స్.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం..!

అహ్మదాబాద్ నగరంలో ఓ వివాహితను లక్ష్యంగా చేసుకుని సాగించిన వేధింపులు, పరువునష్టం కుట్ర వెనుక ఉన్న దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి వ్యక్తిగత జీవితాన్ని అతలాకుతలం చేసిన ఈ కేసులో పోలీసులు తీవ్రంగా గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

గత కొన్ని నెలలుగా అహ్మదాబాద్‌లోని ఒధవ్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ ఫోన్‌కు వింత కాల్స్ రావడం మొదలయ్యాయి. అసలు తన ఫోన్ నంబర్ ఎవరికైనా ఎలా చేరిందో అర్థం కాక అయోమయానికి గురైన ఆమెకు అసలు విషయం తెలిసి గుండె పగిలింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి 10, 20 రూపాయల కరెన్సీ నోట్లపై ఆమె పేరు, ఫోటో, ఇంటి చిరునామా, మొబైల్ నంబర్‌ రాశాడు.

అంతటితో ఆగకుండా, “రూ. 1,000కే సెక్స్ సర్వీస్ కావాలంటే ఈ నంబర్‌ను సంప్రదించండి”, ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్‌లో ఫోటోలు పంపాలంటూ అత్యంత అసభ్యకరమైన రాతలతో కూడిన కాగితాలను ఆ నోట్లకు జతచేశాడు. అలాంటి నోట్లను, కాగితాలను నగరంలోని పలు ప్రాంతాలలో ఆ దుండగుడు పడేసి వెళ్లాడు.

నాలుగు దిక్కుల నుంచీ వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్‌తో ఆ మహిళ కుటుంబ జీవితం, మానసిక ప్రశాంతత పూర్తిగా నాశనమయ్యాయి. నిత్యం తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అసభ్యకరమైన వేధింపులను తట్టుకోలేక, ఆమె తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం వాట్సాప్‌లో వచ్చిన ఒక ఫోటో పోలీసుల దర్యాప్తునకు తొలి ఆధారాన్ని ఇచ్చింది. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తికి ఆ నోటు దొరకడంతో, వెంటనే దానిపై ఉన్న నంబర్‌ను బట్టి సదరు మహిళకు ఫోన్ చేసి వివరాలు తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు.

నిందితుడిని పట్టుకునేందుకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాదాపు 100కు పైగా సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసింది. ఆ పరిశీలనలో ఒక యాక్టివా స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి పార్కింగ్ ప్రాంతంలో ఆ నోట్లను విసిరి వెళ్లడం రికార్డైంది. ఆ దృశ్యాలను బాధిత మహిళకు చూపించగా, అతడు తన దూరపు బంధువేనని గుర్తించి నిర్ఘాంతపోయింది.

దీంతో ఒధవ్ ప్రాంతానికి చెందిన రవీంద్ర ప్రభులాల్ పూరాలాల్ పంచాల్ (36) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: