ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లా బిల్గ్రామ్ ప్రాంతానికి చెందిన విశాల్ పాల్ అనే వ్యక్తి, మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన భార్య కిరణ్ (24) వద్ద రెండు రోజుల క్రితం ఇచ్చిన డబ్బుల్లోంచి రూ.2,000 ఇవ్వాలని గొడవకు దిగాడు.
అందుకు కిరణ్ బదులిస్తూ.. “ఇంటి ఖర్చులు, రేషన్ సరుకులు పోగా మిగిలిన డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టాను, ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వడం కుదరదు” అని చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విశాల్, కొయ్య మొద్దు (కర్ర) తీసుకుని 7 నెలల గర్భవతి అని కూడా చూడకుండా భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
కిరణ్ ఆర్తనాదాలు విని అడ్డుకోవడానికి వచ్చిన తన సొంత తల్లి ప్రేమావతిపై కూడా అతడు దాడి చేసి, ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటివేశాడు. భయంతో వణికిపోయిన ఆ అత్తగారు చుట్టుపక్కల వారిని సాయం చేయాలని వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఆమె స్వయంగా పోలీసులకు సమాచారం అందించింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన కిరణ్ను ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, తప్పించుకుని పారిపోయేందుకు యత్నించిన భర్త విశాల్ను అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ దంపతులకు ఏడాది వయసున్న ఆడబిడ్డ ఉండటం గమనార్హం.
