ఆడపిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం సురక్షితమైన మార్గంలో పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘సుకన్య సమృద్ధి యోజన’ (Sukanya Samriddhi Yojana – SSY) ఒక గొప్ప వరంలా నిలుస్తోంది.
ప్రస్తుత అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకపోవడంతో, ఈ పథకానికి ఏటా 8.2% మేర అత్యధిక వడ్డీ రేటు యథావిధిగా కొనసాగుతోంది.
10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లల పేరుపై తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు కేవలం రూ. 250 చెల్లించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 (గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు) డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 15 ఏళ్ల పాటు డబ్బులు జమ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తగా ఎలాంటి పెట్టుబడి పెట్టకపోయినా, 21వ ఏట పథకం మెచ్యూర్ అయ్యే వరకు మిగిలిన 6 ఏళ్లకు కూడా ఖాతాలోని మొత్తానికి వడ్డీ క్రమం తప్పకుండా జమవుతూనే ఉంటుంది.
ఉదాహరణకు, ఏటా రూ. 500 చొప్పున 15 ఏళ్లలో రూ. 7,500 జమ చేస్తే.. 21 ఏళ్లు పూర్తయ్యే సమయానికి వడ్డీతో కలిపి సుమారు రూ. 23,900 వరకు చేతికి అందుతుంది. అంతేకాకుండా, బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం ఖాతాలోని నిల్వలో 50% వరకు ముందస్తుగా ఉపసంహరించుకునే వెసులుబాటు, వివాహం సమయంలో నిబంధనల ప్రకారం ఖాతాను క్లోజ్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో కల్పించారు.

Leave a Reply