పటాన్: సమాజ మనస్సాక్షిని కదిలించి, మానవత్వాన్ని ముక్కలు చేసే ఒక ఘోరమైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో వెలుగుచూసింది. కేవలం 5,000 రూపాయల అప్పు కోసం, తన నీచమైన కోరికకు లొంగలేదనే కారణంతో ఇద్దరు పిల్లల తల్లి అయిన ఒక యువ వితంతువును సజీవ దహనం చేశారు.
పటాన్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల పింకీబెన్ పట్నీ జీవితం పోరాటాలతో నిండినది. ఏడేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె, తన ఇద్దరు పిల్లల కోసమే జీవిస్తోంది. పేదరికం కారణంగా రోజువారీ కుటుంబ ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న పింకీబెన్, నెల రోజుల క్రితం తన పక్కింటి వాడైన బాబూభాయ్ రావల్ దగ్గర 5,000 రూపాయలు అప్పుగా తీసుకుంది.
ఆ 5,000 రూపాయలే తన మరణ శాసనంగా మారుతుందని ఆమె ఊహించి ఉండదు. అప్పుకు వడ్డీ కావాలంటూ బాబూభాయ్ రావల్ తరచూ పింకీబెన్ ఇంటికి వచ్చి వేధించేవాడు. డబ్బు నెపంతో, ఒంటరిగా ఉన్న ఒక మహిళ పరిస్థితిని ఆసరాగా చేసుకుని, ఆమెపై లైంగిక దాడికి కూడా ప్రయత్నించాడు ఆ వడ్డీ రాక్షసుడు. కానీ, పింకీబెన్ అతని నీచమైన కోరికను నిరాకరించి, ఆత్మగౌరవంతో బతకడానికి పోరాడింది.
గత జూలై 12న, ఈ విషయం మాట్లాడి పరిష్కరించుకుందామని చెప్పి, పింకీబెన్ను స్థానికుడైన జీతూభాయ్ పాంచాల్ ఇంటి దగ్గరకు రమ్మని బాబూభాయ్ పిలిచాడు. తన తల్లితో పాటు ఆమె కూతురు కూడా వెళ్లింది. అక్కడ జరిగిన సంఘటనను పింకీబెన్ కూతురు కన్నీళ్లతో వివరించింది:
‘బాబూభాయ్ మా అమ్మను నా 5,000 రూపాయలు ఇప్పుడే ఇచ్చేయ్ అని బెదిరించాడు. మా అమ్మ మరో రెండు రోజులు సమయం అడిగింది. కానీ అతను వినలేదు. హఠాత్తుగా అతని గొంతు మారింది. ఇక్కడే ఉండండి, నేను టీ తీసుకువస్తాను, అందరం కలిసి తాగుదాం అంటూ ప్రేమగా నటిస్తూ మాట్లాడాడు. మేము అది నమ్మాము. కానీ, అతను టీకి బదులు పెట్రోల్ బాటిల్‌తో వస్తాడని మాకు తెలియదు.’
బాబూభాయ్ టీ తీసుకురావడానికి వెళ్లిన సమయంలో, పింకీబెన్ అక్కడ ఉన్న జీతూభాయ్‌తో తన పరిస్థితిని వివరిస్తోంది. ఆ సమయంలో అక్కడికి అతివేగంగా వచ్చిన బాబూభాయ్, తాను దాచి ఉంచిన పెట్రోల్‌ను పింకీబెన్పై పోసి, రెప్పపాటు కాలంలో నిప్పంటించాడు. మంటలు పింకీబెన్ ను చుట్టుముట్టాయి. ఆమె కేకలు ఆ ప్రాంతాన్ని కదిలించివేశాయి. ఈ ఘాతుకానికి పాల్పడుతున్న సమయంలో అనుకోకుండా బాబూభాయ్కి కూడా మంటలు అంటుకున్నాయి.
తీవ్ర గాయాలపాలైన పింకీబెన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో పోరాడుతున్న సమయంలోనే, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరేష్ రేణుకా సమక్షంలో పింకీబెన్ తన చివరి వాంగ్మూలాన్ని (Dying Declaration) నమోదు చేసింది. పరిస్థితి విషమించడంతో, ఆమెను తదుపరి చికిత్స కోసం అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించారు. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించక, ఆ పోరాట పటిమ గల తల్లి చికిత్స పొందుతూ కన్నుమూసింది. నిందితుడు బాబూభాయ్ కూడా గాయాలతో ఆసుపత్రిలో చేరాడు, ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.
కేవలం 5,000 రూపాయల కోసం ఒక మనిషి ప్రాణాన్ని ఇంత చులకనగా తీసేయాలా? అనాథలుగా మిగిలిన ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు ఎవరు బాధ్యులు? తనను నమ్మి వచ్చిన మహిళను మోసం చేసి, టీ తెస్తానని చెప్పి పెట్రోల్ పోసి తగులబెట్టిన బాబూభాయ్ రావల్ లాంటి సామాజిక విద్రోహులకు చట్టం ముందు అత్యంత కఠినమైన శిక్ష పడాలనేదే ప్రజల డిమాండ్.
