మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ లోనావాలాలో ఉన్న ‘నోస్ట్రావిల్లా’ (Nostravilla) ప్రైవేట్ లగ్జరీ విల్లా అండ్ రిసార్ట్‌లో బస చేసిన ఒక కుటుంబం గదిలోకి పాము దూరింది. అయితే ఆ పామును అక్కడి సిబ్బంది అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది.
పశ్చిమ కనుమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ రిసార్ట్ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం సాధారణమే అయినప్పటికీ, పర్యాటకులు బస చేసిన గదిలోనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటనను నేహా అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో ద్వారా పోస్ట్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రిసార్ట్ యాజమాన్యాన్ని నిలదీయగా.. వాళ్లు ఏమాత్రం పశ్చాత్తాపం చూపకుండా “ఇలాంటివి ఇక్కడ సర్వసాధారణం, అసలు చిన్నపిల్లలను ఎందుకు వెంట తీసుకొచ్చారు?” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా కనీస క్షమాపణ కూడా చెప్పకుండా, “మీ వల్ల ఏమవుతుందో చేసుకోండి” అంటూ తమను బెదిరించారని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏ రకమైన పామునైనా చంపడం చట్టరీత్యా నేరం. రిసార్ట్ సిబ్బంది చేసిన ఈ చట్టవిరుద్ధమైన చర్య, ఆ తర్వాత వారు ప్రదర్శించిన పొగరుబోతు ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్‌లలో పర్యాటకుల భద్రతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply