చత్రా (జార్ఖండ్): జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో మూఢనమ్మకాలు, మత్తు మరియు వింత పిచ్చితో కూడిన ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుందా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి రెండు సజీవ పాములను పచ్చిగా నమిలి మింగేయడమే కాకుండా, చనిపోయిన మూడో పామును చేతిలో పట్టుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్ళాడు. ఈ దృశ్యాన్ని చూసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు.
రెండు పాములు బతికుండగానే.. మూడోది బ్యాగులో: కుందా ప్రాంతంలోని బర్వాదిహ్ గ్రామానికి చెందిన బుధన్ భారతి (45) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బుధన్ తన ఇంటి దగ్గర కనిపించిన రెండు పాములను పట్టుకుని, బతికుండగానే నమిలి మింగేశాడు. మూడో పామును కూడా తినడానికి సిద్ధమవుతుండగా, కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. ఆ తర్వాత బుధన్ ఆ మూడో పామును చంపి, సంచిలో వేసుకుని ప్రతాప్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్ళాడు. వైద్యుల ముందు ఆ పాము కళేబరాన్ని తీయడంతో ఆసుపత్రిలో కలకలం రేగింది.
మద్యం మత్తులో దారుణం: ఆసుపత్రికి వచ్చిన బుధన్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించగా, అతని భార్య అసలు విషయం చెప్పింది. బుధన్ నిజంగానే రెండు పాములను నమిలి తిన్నాడని, ఆ వెంటనే ఎక్కువ మొత్తంలో మద్యం తాగాడని ఆమె తెలిపింది. విపరీతమైన మద్యం మత్తులో, పిచ్చితోనే అతను ఈ ప్రమాదకరమైన పని చేశాడని పేర్కొంది.
శరీరంలో విషం లేదు: ఈ ఘటనపై ప్రతాప్‌పూర్ హెల్త్ సెంటర్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కుమార్ సంజీవ్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో ఇలాంటి వింతైన కేసును ఎప్పుడూ చూడలేదని తెలిపారు. వైద్యుల బృందం వెంటనే బుధన్‌కు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించింది. అదృష్టవశాత్తూ, అతని శరీరంలో పాము విషం ప్రభావం ఏమీ లేదని తేలింది. ప్రస్తుతం బుధన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, అయితే వైద్యులు అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ప్రాణాపాయం కలిగించే పనులకు దూరంగా ఉండాలని వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
