రెండు ప్రభుత్వ ఉద్యోగాలనే వదులుకున్నారు..! “ఒక్కగానొక్క కొడుకును పెంచేందుకు తండ్రి పడరాని పాట్లు”. కానీ కాళ్లు విరగ్గొట్టి ఫ్యాన్ కూడా లేని గదిలో బంధించాడు.. 80 ఏళ్ల వృద్ధుడి దీనస్థితి.. ఆస్తి కోసం రాక్షసుడిగా మారిన కర్కోటక కొడుకు..!

ఉత్తరప్రదేశ్ మైన్‌పురి ప్రాంతంలో ఆస్తి కోసం కన్నతండ్రినే కొడుకు చిత్రహింసలకు గురిచేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

జీవితాంతం కష్టపడి ప్రయోజకుడిని చేసిన 80 ఏళ్ల తండ్రిని.. ఒక్కగానొక్క కొడుకు తీవ్రంగా కొట్టి, కాలు విరగ్గొట్టి, చీకటి గదిలో బంధించిన అమానుష ఘటన మానవత్వాన్ని కదిలించివేసింది.

మైన్‌పురి ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వీరేంద్ర సింగ్, తన ఏకైక కుమారుడైన రాజ్‌పాల్ సింగ్ భవిష్యత్తు కోసం జీవితాన్ని ధారపోశారు. భార్య మరణానంతరం కొడుకు ఆలనాపాలనా చూసుకోవడం కోసం ఆయన తన ప్రభుత్వ ఉద్యోగాలను (మొదట సైన్యం, తర్వాత అమీన్ ఉద్యోగం) సైతం వదులుకున్నారు. అయితే, తాను ప్రాణంగా పెంచిన కొడుకే భవిష్యత్తులో తనకు యముడిగా మారతాడని ఆ వృద్ధుడు కలలో కూడా ఊహించలేదు.

ఆస్తులను తన పేరు మీద రాయాలని రాజ్‌పాల్ సింగ్ తండ్రిని నిరంతరం వేధించేవాడు. గత వారం, వృద్ధుడైన వీరేంద్ర సింగ్‌పై దాడి చేసి ఆయన కాలు ఎముకను విరగ్గొట్టాడు. అంతటితో ఆగకుండా, నొప్పితో విలవిల్లాడుతున్న తండ్రిని కనీసం ఫ్యాన్ కూడా లేని ఒక గదిలో బంధించాడు.

సెప్టెంబర్ 6న, నోయిడాలో ఉంటున్న ఆయన కుమార్తె, ఢిల్లీలో ఉంటున్న మనవడు తాతను చూసేందుకు మైన్‌పురికి వచ్చారు. అక్కడ వీరేంద్ర సింగ్ దీనస్థితిలో మూలుగుతూ పడి ఉండటం చూసి వారు నిర్ఘాంతపోయారు. వెంటనే ఆయన్ను కాపాడి నోయిడాకు తరలించారు.

సెప్టెంబర్ 7న నోయిడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, ఆయన తొడ ఎముక తీవ్రంగా విరిగిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మనవడి ఫిర్యాదు మేరకు.. కొడుకు కర్కశంగా కొట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టమైంది.

వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రస్తుత ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) లేదా ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. కన్నతండ్రిని చిత్రహింసలకు గురిచేసిన కొడుకుపై, అతడికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: