“రైలులో మొదటి రాత్రి ? పూల అలంకరణతో బెర్తులు.. నూతన వధూవరుల వింత చర్యతో షాకైన ప్రయాణికులు! వైరల్ వీడియో”

రైలులోని ఫస్ట్ క్లాస్ కూపేను పెళ్లి గది (మొదటి రాత్రి గది) లాగా అలంకరించి, బెర్తులపై పూలు చల్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఆ వీడియోలో, ఒక లగ్జరీ హోటల్‌లోని ‘హనీమూన్ సూట్’ లాగా ఆ కూపే మొత్తం అద్భుతంగా అలంకరించబడి ఉంది. గది పైకప్పుపై ఎరుపు, తెలుపు రంగు బెలూన్లు, సీట్లపై గులాబీ రేకులతో గుండె ఆకారాలు, పూలమాలలు మరియు మెట్లపై రంగురంగుల కృత్రిమ లైట్లతో అలంకరణ చేశారు. అంతేకాకుండా, గదిలోని అప్పర్ బెర్త్‌పై ”ఐ లవ్ యూ” అని రాసి ఉండటం కూడా వీడియోలో కనిపిస్తోంది.

డెకరేటర్లతో అలంకరణ: సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో, ప్రయాణికులు రైల్వే అధికారులను నిలదీశారు. దీనిపై విచారణ చేపట్టిన రైల్వే శాఖ, సంబంధిత టికెట్ ఎగ్జామినర్‌ను సస్పెండ్ చేసింది. మహారాష్ట్రలోని జల్నా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ఈ అలంకరణ జరిగినట్లు రైల్వే గుర్తించింది.

కూపే బుక్ చేసుకున్న ఆ జంట, ఆన్‌లైన్ ద్వారా ప్రైవేట్ డెకరేటర్లను పిలిపించి రైలు కోచ్‌ను అలంకరించారు. అలంకరణ చేసిన ప్రైవేట్ సంస్థే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు సమాచారం. అయితే, ఆ ప్రయాణికులు ఎవరు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

అలంకరణలకు అనుమతి ఉందా? రైలులో ఇలాంటి అలంకరణలకు అనుమతి ఉందా? అని ప్రయాణికులు ప్రశ్నించగా, రైల్వే శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వివరణ ఇచ్చింది. “జూలై 6న వండి నంబర్: 11002 నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన దంపతులు, ఫస్ట్ ఏసీ కూపేని అలంకరించడానికి ఆన్‌లైన్ ద్వారా ప్రైవేట్ డెకరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రైలు జల్నా స్టేషన్‌కు రాగానే, ఆ డెకరేషన్ సంస్థకు చెందిన వ్యక్తి ఎటువంటి అనుమతి లేకుండా లోపలికి వచ్చి అలంకరణ పనులు చేశాడు. ఇది భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే” అని పేర్కొంది.

విచారణకు ఆదేశం: “నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వే ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేశాము. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాము. విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని రైల్వే శాఖ తెలిపింది.

రైలు కోచ్‌ను పెళ్లి గదిలా మార్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, రైలులో బయటి వ్యక్తులు వచ్చి అంతసేపు డెకరేషన్ చేస్తుంటే రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని, వారి పర్యవేక్షణ లోపంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: