రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగవచ్చు.? గుండె శస్త్రచికిత్స నిపుణుడు తెలిపిన ఆశ్చర్యకరమైన సమాచారం.!

ఉదయం వేళను ఒక కప్పు వేడివేడి కాఫీతో ప్రారంభించడం చాలామందికి ఇష్టమైన అలవాటు. కానీ, “కాఫీ తాగడం గుండెకు మంచిదేనా?” అనే ప్రశ్న చాలా కాలంగా చర్చలో ఉంది.

దీనికి సమాధానమిస్తూ, ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుడు ఒకరు కాఫీ తాగడం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు మరియు రోజుకు ఎంత కాఫీ తాగడం సురక్షితం అనే వివరాలను పంచుకున్నారు.

గుండె శస్త్రచికిత్స నిపుణుడైన డాక్టర్ జెరెమీ లండన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. అందులో, పరిమితంగా కాఫీ తాగడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ రక్తనాళాల పనితీరును క్రమబద్ధీకరించి, శరీరంలో కలిగే వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, సరైన పరిమాణంలో కాఫీ తాగేవారికి గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.

అలాంటప్పుడు, రోజుకు ఎంత కాఫీ తాగవచ్చు? హృదయరోగ నిపుణుల సూచన ప్రకారం, రోజుకు 2 నుండి 3 కప్పుల కాఫీ (సుమారు 200 నుండి 300 మిల్లీగ్రాముల కెఫీన్) తాగడం గుండెకు ఎంతో శ్రేయస్కరం. కానీ, ఇందులో అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, కాఫీలో ఎక్కువ పరిమాణంలో చక్కెర, ఎక్కువ కొవ్వు ఉన్న పాలు లేదా ఫ్లేవర్లను చేర్చడం నివారించాలి. బ్లాక్ కాఫీ లేదా తక్కువ పరిమాణంలో పాలు, తక్కువ చక్కరతో తాగడమే పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది.

అదే సమయంలో, పరిమితికి మమించి కాఫీ తాగడం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి, ఆందోళన మరియు అధిక రక్తపోటును కలిగిస్తుంది. ముఖ్యంగా, ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు లేదా రక్తపోటు సమస్య ఉన్నవారు తమ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే కాఫీ తాగే పరిమాణాన్ని నిర్ధారించుకోవాలి. ఏది ఏమైనా ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే నానుడి కాఫీకి కూడా వర్తిస్తుందనేది వైద్యుడి అభిప్రాయం.


Posted

in

by

Tags: