రోడ్డు పక్కన ఆగి ఉన్న ఈ-రిక్షా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన థార్ (Thar) చేసిన ఘోరం..! నీటిలో జారి అదుపుతప్పిన కారు.. గాల్లోకి ఎగిరిపడ్డ ఈ-రిక్షా.. సీసీటీవీలో రికార్డయిన భయానక దృశ్యం..!!!

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో భారీ వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచి ఉన్న సమయంలో ఓ భయానక రోడ్డు ప్రమాదం జరిగింది.

రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఈ-రిక్షాను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన థార్ (Thar) కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఈ-రిక్షా డ్రైవర్, 42 ఏళ్ల మహ్మద్ నసీమ్ మృతి చెందాడు.

రుస్తం నగర్ సహస్‌పూర్ ప్రాంతంలోని బ్లాక్ ఆఫీస్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా హైవేపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో నసీమ్ తన ఈ-రిక్షాను ఆయిషా మసీదు సమీపంలో నిలిపి ఉంచగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన థార్ కారు ఒక్కసారిగా అదుపుతప్పినట్లు సమాచారం.

థార్ కారు ఢీకొట్టిన వేగం చాలా ఎక్కువగా ఉండటంతో, ఈ-రిక్షా గాల్లోకి ఎగిరిపడి నుజ్జునుజ్జయింది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి.

ప్రమాదం జరిగిన తర్వాత థార్ కారులో నుంచి దిగిన డ్రైవర్, స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన నసీమ్‌ను సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ పరీక్షించిన వైద్యులు, అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: