ముంబై: చాలా మంది తేనెటీగల ధ్వని వినగానే భయపడి దూరంగా పారిపోతారు. కానీ నాసిక్‌కు చెందిన గజానన్ భలేరావుకు ఆ ధ్వని భయం కాదు, ఒక గొప్ప అవకాశం. గత 18 ఏళ్లుగా ఆయన తేనెటీగల పెంపకం (Apiculture) రంగంలో చురుగ్గా ఉంటూ తన కుటుంబానికి ఉపాధి కల్పించడమే కాకుండా, దేశవ్యాప్తంగా వేలాది మంది రైతుల ఆదాయం పెరగడంలో కీలక పాత్ర పోషించారు.
రైతు కుటుంబం నుండి పారిశ్రామికవేత్తగా: హింగోలి జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గజానన్, ఉపాధి వెతుక్కుంటూ నాసిక్ వచ్చారు. అక్కడ ఆయన జీవితం మలుపు తిరిగింది. నేడు ‘కిసాన్ మధుమక్షిక ఫామ్స్’ పేరుతో ఆయన వ్యాపారం దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించింది. ఈ ప్రయాణంలో ఆయన భార్య మాధురి భలేరావు అండగా ఉంటూ తేనె సేకరించడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్ మరియు విక్రయాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
పంటలకు అనుగుణంగా వలస వెళ్లే వ్యాపారం: వీరి వ్యాపారం ఒకే చోట స్థిరంగా ఉండదు. పంటల సీజన్‌ను బట్టి మారుతూ ఉంటుంది. వీరి ట్రక్కులో ఎప్పుడూ 500కు పైగా తేనెటీగల పెట్టెలు, గుడారాలు మరియు అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం నాసిక్‌లోని మాలెగావ్ ప్రాంతంలో సజ్జ చేలల్లో తేనెటీగల పెట్టెలను ఉంచి పని చేస్తున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని దానిమ్మ, జామ తోటలకు.. అటుపై రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆవాల చేలకు తమ కాపురాన్ని మారుస్తారు.
“తేనెటీగల వల్ల సహజ పరాగసంపర్కం (Pollination) పెరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి కనీసం 40 నుండి 50 శాతం పెరుగుతుంది. ఈ ప్రయోజనం రైతులకు ఎంతో మేలు చేస్తుంది” అని గజానన్ భలేరావు చెబుతారు.
2007లో తీసుకున్న నిర్ణయం: గజానన్ 16 ఏళ్ల వయసులో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ రాజస్థాన్ వెళ్లినప్పుడు, రోడ్డు పక్కన ఉంచిన తేనెటీగల పెట్టెలు ఆయనను ఆకర్షించాయి. ఆ అనుభవంతోనే తేనెటీగల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు. పూణేలోని సెంట్రల్ బీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి శిక్షణ పొంది, 2007లో స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు.
వేలాది మంది రైతులకు లబ్ధి: గత 18 ఏళ్లలో భలేరావు దంపతులు 80 వేల మందికి పైగా రైతులకు పరాగసంపర్కం ద్వారా దిగుబడి పెరిగేలా సహాయపడ్డారు. ప్రస్తుతం వీరి వద్ద 1000కి పైగా తేనెటీగల పెట్టెలు ఉన్నాయి. ప్రతి పెట్టెలో 14 నుండి 16 వేల తేనెటీగలు ఉంటాయి. తేనెటీగల పెంపకం కేవలం లాభసాటి వ్యాపారం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా ఒక మార్గమని ఆయన నమ్ముతారు.
