బ్రిటన్లోని వేల్స్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల స్టెసీ ఎహెర్న్ అనే మహిళ యొక్క 3 ఏళ్ల కూతురు వైంటర్, తినడానికి వీలు లేని విచిత్రమైన వస్తువులను తినే అరుదైన అలవాటుతో బాధపడుతోంది.
పాప పుట్టిన 13 నెలల వరకు సాధారణంగానే పెరిగినప్పటికీ, ఆ తర్వాత ఇంట్లోని సోఫాలో ఉన్న దూది, గోడలపై ఉన్న సున్నం, ఉన్ని (గొర్రె బొచ్చు) వంటి వాటిని తినడం ప్రారంభించడాన్ని తల్లి గమనించింది.
రాత్రి సమయంలో నిద్ర లేచే ఆ చిన్నారి, తన మంచాన్ని, దుప్పటిని నమలడం ప్రారంభించింది. చిన్నతనంలో అసాధారణంగా జరుగుతున్న ఈ షాకింగ్ ఘటనను చూసిన తల్లి, వెంటనే పాపను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించింది.
పాపను పరీక్షించిన వైద్యులు, ఆ చిన్నారి ‘ఆటిజం’ సమస్యతో పాటు ఆహారం కాని వస్తువులను తినడానికిష్టపడే ‘పైకా’ (Pica) అనే అరుదైన వ్యాధితో కూడా బాధపడుతోందని తెలిపారు. ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో ఈ పైకా వ్యాధి లక్షణాలు కనిపించడం సహజమేనని వైద్యులు వివరించారు.
తన బిడ్డ పరిస్థితి గురించి ఆవేదనతో మాట్లాడిన తల్లి స్టెసీ, “ఆమె నిజంగా ఇల్లంతా తినడానికి ప్రయత్నిస్తోంది. కొత్త సోఫాలో నుంచి దూదిని తీసి తింటోంది. సాధారణ ఆహారం కంటే దూదిని తినడానికే ఎక్కువ ఇష్టపడటమే కాకుండా, ఫోటో ఫ్రేమ్లను పగలగొట్టి గాజు ముక్కలను కూడా తినడానికి ప్రయత్నించింది” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
పాపకు ఆటిజం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మాట్లాడలేకపోతోందని, ఆమెకు పలు ప్రవర్తనా సంబంధిత సమస్యలు ఉన్నాయని తల్లి పేర్కొంది. పాపను రోజంతా క్షణం కూడా కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూసుకుంటుండటం వల్ల ఎలాంటి పెద్ద గాయాలు కాకుండా కాపాడుకోగలుగుతున్నానని ఆమె తెలిపింది.

Leave a Reply