పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లాలోని కోట్ ఇసే ఖాన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సునీతా బావా.. లంచం తీసుకున్న నేరంపై పంజాబ్ అవినీతి నిరోధక శాఖ (విజిలెన్స్) అధికారులకు పట్టుబడి అరెస్ట్ అయ్యారు.
ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరించి, అతని నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఈ అధికారిణి ప్రయత్నించారు. ఇప్పటికే కొంత మొత్తం తీసుకున్న ఆమె, మరో రూ. 50 వేలు లంచం డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఇచ్చిన రహస్య ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్నారు.
ప్రణాళిక ప్రకారం గత శనివారం రాత్రి జీరా రోడ్డు ప్రాంతంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆ మహిళా ఇన్స్పెక్టర్ను, ఆమె సహాయకుడైన హోంగార్డును రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
అధికారులు చుట్టుముట్టిన ఆ సమయంలో కూడా ఏమాత్రం భయం గానీ, ఆందోళన గానీ లేకుండా ఆ మహిళా అధికారిణి ప్రవర్తించిన తీరు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అరెస్ట్ అయిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె నిర్లక్ష్యంగా, పొగరుగా సమాధానం ఇవ్వడం అందరినీ షాక్కు గురిచేసింది.
అరెస్ట్ అనంతరం మీడియా కెమెరాల ముందు మాట్లాడిన ఆ మహిళా ఇన్స్పెక్టర్.. “అంతా బాగానే ఉంది, జీవితంలో ఎత్తుపల్లాలు సహజం, వాటిని ఎదుర్కోవాలి” అంటూ నవ్వుతూ చెప్పారు. జైలుకు వెళ్తున్నామనే కనీస బాధ లేకుండా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఉన్నతాధికారిణి ఇలా లంచం కేసులో దొరికిపోవడం, దానిపై కనీస పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని, చర్చను రేకెత్తించింది.

Leave a Reply