లడఖ్ పర్యాటకుల మొబైల్స్‌లో చైనా టైమ్ జోన్.. నెట్టింట వైరల్ వీడియో, భద్రతపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు!

లేహ్: మంచుతో కప్పబడిన కొండలు, విశాలమైన రహదారులు, సాహసంతో కూడిన ప్రయాణం.. లడఖ్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది ఇదే. ప్రతి ఏటా లక్షలాది మంది బైకర్లు, పర్యాటకులు ఈ అందమైన ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. అయితే, ఇటీవల కొంతమంది భారతీయ బైకర్లకు ఒక వింతైన, షాకింగ్ అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఎక్స్ (ట్విట్టర్) లో @EinstYdv అనే ఐడీ గల ఐన్‌స్టీన్ యాదవ్ అనే యూజర్ ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక భారతీయ బైక్ రైడర్ లడఖ్‌లో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా అతని మొబైల్‌కు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అందులో “Your time zone changed. You’re now in China Standard Time” (మీ టైమ్ జోన్ మారింది. మీరు ఇప్పుడు చైనా స్టాండర్డ్ టైమ్‌లో ఉన్నారు) అని చూపించింది. అంటే భారతదేశ భూభాగంపై నిలబడి ఉన్నప్పటికీ, ఫోన్ మాత్రం చైనా సమయాన్ని చూపించడం గమనార్హం. ఈ పోస్ట్‌కు 14 వేలకు పైగా లైకులు, 4 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.

మొబైల్ టైమ్ జోన్ అసలు ఎందుకు మారింది?
ఆ వీడియోను గమనిస్తే, బైకర్ ఫోన్‌లో రాత్రి 7:38 గంటల సమయం చూపిస్తోంది. కానీ, ఆ సమయంలో భారతదేశంలో సాయంత్రం సుమారు 5 గంటలు అవుతోంది. అంటే ఈ రెండు సమయాల మధ్య ఏకంగా రెండున్నర గంటలకు పైగా వ్యత్యాసం ఉంది.

వాస్తవానికి దీని వెనుక ఒక సాంకేతిక (Technical) కారణం ఉంది. మన స్మార్ట్‌ఫోన్లలో “Automatic Time Zone” అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. ఇది సమీపంలోని మొబైల్ టవర్ సిగ్నల్‌ను బట్టి ఆటోమేటిక్‌గా సమయాన్ని మార్చేస్తుంది. లడఖ్ సరిహద్దుల్లో భారతీయ నెట్‌వర్క్ సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. ఇదే తరుణాన్ని ఆసరాగా చేసుకుని చైనా తన సరిహద్దుకు సమీపంలో అత్యంత శక్తివంతమైన మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ చైనా టవర్ల సిగ్నల్స్ భారత సరిహద్దుల లోపలి వరకు వస్తుంటాయి. బైకర్ ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు, అతని ఫోన్ భారతీయ నెట్‌వర్క్‌ను కోల్పోయి, చైనా నెట్‌వర్క్‌ను క్యాచ్ చేసింది. దీనివల్ల టైమ్ జోన్ ఆటోమేటిక్‌గా చైనా స్టాండర్డ్ టైమ్‌కు మారిపోయింది.

వీడియో వైరల్ కావడంతో మొదలైన చర్చ:
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చే నడిచింది. ముకేష్ కుమార్ కస్వాన్ అనే యూజర్ కామెంట్ చేస్తూ.. “భయ్యా, నువ్వు చైనా భూభాగంలో నిలబడితేనే సి.ఎస్.టి (CST) వస్తుంది, నువ్వు ఎక్కడ ఉన్నావో ఒకసారి చూసుకో” అని పేర్కొన్నాడు. అంటే బైకర్లు తమకు తెలియకుండానే ఎల్‌ఏసీ (Line of Actual Control – వాస్తవాధీన రేఖ) దాటేశారా? అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేశారు.

మరోవైపు, @yongshi అనే ఒక చైనా యూజర్ స్పందిస్తూ.. “లడఖ్ పురాతన కాలం నుండి చైనా భూభాగమే” అంటూ అవాకులు చవాకులు పేలాడు. దీనిని భారతీయ నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంపై వీడియో పోస్ట్ చేసిన ఐన్‌స్టీన్ యాదవ్ స్వయంగా స్పందిస్తూ.. “కామెంట్లలో పాఠాలు చెప్పేవాళ్లు ఒక్కటి గుర్తుంచుకోవాలి.. ఈ సమస్య నేరుగా భారతదేశ డిజిటల్ మరియు నెట్‌వర్క్ భద్రతకు సంబంధించింది” అని గట్టిగా సమాధానమిచ్చారు.


Posted

in

by

Tags: