మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో, పోలీస్ యూనిఫాంలో సోషల్ మీడియా రీల్స్ చేసినందుకు మహిళా సబ్-ఇన్స్పెక్టర్ ప్రియాంక పటేల్‌పై క్రమశిక్షణా చర్యలు మొదలయ్యాయి.
జబల్పూర్ నాకా పోలీస్ చౌకీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఆమె, తన యూనిఫాంలో కుర్చీలో కూర్చుని ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో, “నా సొంత సమస్యలకే ఇంకా పరిష్కారం దొరకలేదు, కానీ ఇతరుల సమస్యలను పరిష్కరించే వృత్తిని ఎంచుకున్నాం” అనే ఎమోషనల్ లైన్లను కూడా రాసుకొచ్చారు. ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
పోలీసుల క్రమశిక్షణను, విభాగం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా యూనిఫాంలో ఇలాంటి వీడియోలను పంచుకోకూడదని పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఇప్పటికే కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై స్పందించిన దామోహ్ జిల్లా అదనపు ఎస్పీ సుజిత్ పదారియా మాట్లాడుతూ, ఇది ప్రాథమికంగా క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తున్నామని, ఆ వీడియో యొక్క ప్రామాణికతను పరిశీలించేందుకు సైబర్ నిపుణులకు పంపామని తెలిపారు. అలాగే, సబ్-ఇన్స్పెక్టర్ ప్రియాంక పటేల్‌కు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశామని, ఆమె ఇచ్చే సమాధానం మరియు విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ధృవీకరించారు.
