లోక్‌సభలో రాజకీయ యుద్ధం: మహిళా రిజర్వేషన్లపై అఖిలేష్ వర్సెస్ అమిత్ షా.. ‘కుల గణన’ చుట్టూ ముదిరిన వివాదం!

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ సంధించిన ప్రశ్నలకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంతే ధీటుగా బదులిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశాలపై సభలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.

అఖిలేష్ ప్రశ్న: “ఇంత తొందర ఎందుకు? ఇది మోసం కాదా?”

లోక్‌సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను తప్పుబట్టారు.

  • “మహిళా రిజర్వేషన్ల విషయంలో కేంద్రం ఇంతలా ఎందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది? ముందు జనగణన (Census) పూర్తి చేయండి. ఆ తర్వాతే పునర్విభజన ప్రతిపాదనలు చేపట్టాలి” అని డిమాండ్ చేశారు.
  • నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రిజర్వేషన్లు తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. జనగణన పూర్తి కాగానే తాము ఖచ్చితంగా ‘కుల గణన’ డిమాండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అమిత్ షా కౌంటర్: “మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం”

అఖిలేష్ వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు.

  • కుల గణనపై క్లారిటీ: “దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని దేశప్రజలకు తెలియజేస్తున్నాను. కులాల వారీగా వివరాల సేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అని వెల్లడించారు.
  • ముస్లిం కోటాపై గరం: ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మతం ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని షా తేల్చి చెప్పారు. “మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదు” అని స్పష్టం చేశారు.

ఎస్పీ ఎంపీల నిరసన

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులను వ్యతిరేకించారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, మరియు పునర్విభజన (Delimitation) బిల్లులను తాము అంగీకరించబోమని చెప్పారు. అయితే, మహిళా రిజర్వేషన్లకు తమకంటే పెద్ద మద్దతుదారులు ఎవరూ లేరని ఆయన చెప్పుకొచ్చారు.

స్పెషల్ సెషన్‌లో బిల్లుల జోరు

‘నారీ శక్తి వందన్ అధినియం’కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది.

  • 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నది కేంద్రం లక్ష్యం.
  • ఇందుకోసం 2011 జనగణన ప్రాతిపదికన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • బిల్లులను త్వరితగతిన ఆమోదించేందుకు ‘రూల్ 66’ నిబంధనలను సడలించాలని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రతిపాదించారు.


Posted

in

by

Tags: