న్యూయార్క్: జేపీ మోర్గాన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హాజ్దిని తనను లైంగికంగా వేధించారంటూ ఒక మాజీ బ్యాంకర్ దాఖలు చేసిన కేసులో కొత్త సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలను బలపరిచేలా, ఒక అజ్ఞాత వ్యక్తి (బాధితుడి స్నేహితుడు) ఇచ్చిన సాక్షి వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, గత వారం దాఖలై వెంటనే ఉపసంహరించుకున్న ఈ దావా, సోమవారం మళ్లీ మన్హట్టన్ సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. తనను హాజ్దిని ఒక “లైంగిక బానిస”గా మార్చుకున్నారని బాధితుడు గతంలో చేసిన ఆరోపణలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే, జేపీ మోర్గాన్ మరియు లోర్నా హాజ్దిని ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించారు. బ్యాంక్ అంతర్గత విచారణలో ఎలాంటి తప్పు జరగలేదని తేలిందని వారు పేర్కొన్నారు.
కొత్త సాక్ష్యాల్లో ఏముంది?
సెప్టెంబర్ 2024లో జరిగినట్లు చెబుతున్న కొన్ని సంఘటనలను వివరిస్తూ అజ్ఞాత సాక్షి వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించారు.
- ఆ సాక్షి కథనం ప్రకారం.. న్యూయార్క్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లో తాను నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న హాజ్దిని తనను నిద్రలేపారు.
- “పూర్తి నగ్నంగా” ఉన్న ఆమె, సోఫాపై కూర్చుని సిగరెట్ వెలిగించి, బెడ్రూమ్లోకి వచ్చి తమతో (త్రీసమ్) చేరాలని తనను బ్రతిమిలాడిందని ఆ సాక్షి పేర్కొన్నారు.
- తాను నిరాకరించినప్పటికీ.. “అతడు (బాధితుడు) నా ఆధీనంలో ఉన్నాడని నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు వచ్చి మాతో చేరడం మంచిది” అని ఆమె బెదిరింపు ధోరణిలో మాట్లాడిందని సాక్షి వివరించారు. ఆ తర్వాత బెడ్రూమ్ నుండి బాధితుడు “వద్దు, వద్దు.. ఆపేయ్” అని బ్రతిమిలాడుకోవడం తాను విన్నానని ఆయన తెలిపారు.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత, బాధితుడు తన స్నేహితుడితో మాట్లాడుతూ.. హాజ్దిని తనను నిరంతరం వేధిస్తోందని, తన మాట వినకపోతే కెరీర్లో సమస్యలు ఎదురవుతాయని బెదిరించి లైంగిక కార్యకలాపాలకు బలవంతం చేస్తోందని వాపోయినట్లు సమాచారం.
పిటిఎస్డి (PTSD) బారిన బాధితుడు?
ఈ వేధింపుల కారణంగా తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి (PTSD – Post Traumatic Stress Disorder) లోనయ్యానని బాధితుడు కోర్టుకు తెలిపారు. ఒక ప్రముఖ సైకోథెరపిస్ట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ లేఖ ఇచ్చారు. జూన్ 2025లో బాధితుడు రాసిన ఈమెయిల్లో.. తాను వారాల తరబడి నిద్రపోవడం లేదని, సరిగ్గా తినలేకపోతున్నానని, తన తలలో హాజ్దిని గొంతు వినిపిస్తూ భయం కలిగిస్తోందని పేర్కొన్నారు.
