“వంట చేసినా, ఇల్లు తుడిచినా వంకలే పెడుతున్నారు. వర్షం పడుతుంటే తడుస్తూ నేనే వెళ్లి బట్టలు తీయాలా? అత్తను కడతేర్చిన కోడలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!”

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లాలోని కర్నావాలా గ్రామంలో కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక దారుణ హత్య చోటుచేసుకుంది.

వంట, ఇంటి పనుల విషయంలో తలెత్తిన వివాదంలో ఆగ్రహానికి గురైన కోడలు, తన అత్తను పదునైన ఆయుధంతో గొంతు కోసి కిరాతకంగా హత్య చేసింది.

ఘటన జరిగిన రోజున భర్త కమల్ ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం ముగించుకుని పనికి వెళ్లాడు. పిల్లలు కూడా ట్యూషన్‌కు వెళ్లడంతో ఇంట్లో అత్త, కోడలు ప్రీతి మాత్రమే ఉన్నారు. సాయంత్రం సమయంలో భర్త కమల్‌కు ఫోన్ చేసిన ప్రీతి, “అమ్మ మెట్లపై నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు” అని కంగారుగా చెప్పింది.

వెంటనే కంగారుపడుతూ ఇంటికి పరుగెత్తుకొచ్చిన కమల్‌కు తీరని షాక్ తగిలింది. తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. అంతేకాకుండా ఆమె శరీరంపై తీవ్ర గాయాలు కనిపించాయి. దీంతో భార్యపై అనుమానం వచ్చిన కమల్, వెంటనే తన మామయ్యను, గ్రామస్తులను పిలిపించి ఆరా తీశాడు.

కుటుంబ సభ్యులు, స్థానికులు నిలదీసి ప్రశ్నించగా.. ప్రీతి పొంతనలేని సమాధానాలు చెబుతూ అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. దొరికిపోతాననే భయంతో కుటుంబ సభ్యులపైనే దాడికి దిగింది. వెంటనే గ్రామస్తులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల గట్టి విచారణను ప్రీతి తట్టుకోలేకపోయింది. చివరకు తను చేసిన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ, “అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఆ కోపంలోనే కోడలు ఈ దారుణానికి ఒడిగట్టిందని” వెల్లడించారు.

పోలీసుల ఎదుట ప్రీతి ఇచ్చిన వాంగ్మూలంలో.. “వంట చేయడం గురించి, ఇల్లు శుభ్రం చేయడం గురించి అత్త తరచూ నన్ను తిడుతుండేది. వర్షం పడుతున్నప్పుడు తడిసిన బట్టలు తియ్యాలని నన్ను దూషించింది. నేను పైకి వెళ్లి బట్టలు తియ్యలేదనే కారణంతో తీవ్ర ఆగ్రహంతో నన్ను శపించింది. ఆ క్షణికావేశంలోనే కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాను” అని తెలిపింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామమంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.


Posted

in

by

Tags: