వడదెబ్బ (Heat Stroke) అంటే ఏమిటి? ఎవరిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది?

వడదెబ్బ అంటే ఏమిటి?: సాధారణంగా వేసవిలో ఎండ ప్రభావం ఉండటం సహజం. అయితే, ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరిగి భూమి నిప్పుల కొలిమిలా మారుతోంది. దీనివల్ల మనుషులు మరియు ఇతర జీవుల శరీర ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. శరీరం తనను తాను చల్లబరచుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు ‘వడదెబ్బ’ తగులుతుంది. దీనివల్ల పక్షవాతం, స్పృహ కోల్పోవడం మరియు కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు.

ఎవరికి ప్రమాదం ఎక్కువ?: వడదెబ్బ ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది. యువకుల్లో చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ వృద్ధులలో సహజంగానే ఆ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, దీనివల్ల వారి శరీరం త్వరగా చల్లబడదు. అందుకే వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ.

శరీర వేడిని తగ్గించుకోవడానికి ఏం చేయాలి?:

  • ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేయాలి.
  • నీరు అధికంగా తాగాలి.
  • ద్రవ రూపంలో ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవడం చాలా ఉత్తమం.
  • లేత రంగులో ఉండే వదులైన కాటన్ దుస్తులను ధరించాలి.
  • జీన్స్, టీ-షర్టులు, పట్టు వస్త్రాలను నివారించడం మంచిది.
  • వీలైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకండి.
  • ఏసీ లేదా కూలర్ల సహాయంతో గదిని చల్లగా ఉంచుకోండి.

తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు వెంట ఉండాల్సినవి:

  • ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు
  • వాటర్ బాటిల్
  • గొడుగు
  • రుమాలు (Handkerchief)
  • సన్ గ్లాసెస్ (Cooling Glass)

బయటకు వెళ్లినప్పుడు పాటించాల్సిన నిబంధనలు:

  • వీలైనంత వరకు బయటకు ఒంటరిగా వెళ్లకండి.
  • ద్విచక్ర వాహనాలపై ప్రయాణాన్ని తగ్గించి బస్సు, కార్ లేదా ఆటోలలో వెళ్లడం మంచిది.
  • ఎండ తగిలే శరీర భాగాలకు ‘సన్ స్క్రీన్’ లోషన్ ఉపయోగించండి.
  • పనులు ఉంటే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూర్తి చేసుకోండి.
  • ఎండలో కష్టతరమైన పనులు చేయడం మానుకోండి.

ఎండలో స్పృహ కోల్పోయిన వారికి ప్రథమ చికిత్స: ఒక వ్యక్తి ఎండలో స్పృహ కోల్పోతే అది వడదెబ్బ లక్షణం కావచ్చు. అప్పుడు వెంటనే:

  1. ఆ వ్యక్తిని నీడ ఉన్న ప్రదేశానికి మార్చాలి.
  2. ముఖంపై చల్లని నీరు చిలకరించాలి.
  3. కాటన్ గుడ్డను చల్లని నీటిలో ముంచి తల మరియు శరీరంపై తుడుస్తూ ఉష్ణోగ్రత తగ్గించాలి.
  4. పరిస్థితి విషమిస్తే వెంటనే అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రికి తరలించాలి.

Posted

in

by

Tags: